Adani Aluminium: అదానీ నెక్ట్స్ టార్గెట్ ఆ రెండు పెద్ద కంపెనీలేనా? ఏకంగా రూ. 1.1 లక్షల కోట్లతో గౌతమ్ అదానీ సరికొత్త ప్లాన్!

  • మెటల్ మార్కెట్లో అదానీ మెగా స్కెచ్..
  • అల్యూమినియం రంగంలోకి భారీ ఎంట్రీ!
Adani

Adani

Adani Aluminium: దేశీయ మౌలిక సదుపాయాల (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) రంగంలో దూసుకుపోతున్న పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ మరో భారీ ప్లాన్ చేశారు. సిమెంట్, రాగి (కాపర్) వ్యాపారాల్లో సత్తా చాటిన అదానీ గ్రూప్.. ఇప్పుడు దేశంలోనే అత్యంత కీలకమైన అల్యూమినియం రంగంలోకి అడుగుపెడుతోంది. దీనికోసం అబుదాబికి చెందిన ‘ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ’ (IHC)తో కలిసి అదానీ గ్రూప్ 50:50 షేర్‌తో ఒక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ఈ భాగస్వామ్యం కింద ఒడిశాలో ఏకంగా రూ. 1.1 లక్షల కోట్ల (11.5 బిలియన్ డాలర్లు) భారీ పెట్టుబడి పెట్టనున్నారు. భారత మెటల్ రంగా చరిత్రలోనే ఇది అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్‌లలో ఒకటిగా నిలవనుంది.

ఇద్దరు దిగ్గజాల గుత్తాధిపత్యానికి బ్రేక్

ప్రస్తుతం భారత అల్యూమినియం మార్కెట్‌పై హిందాల్కో, వేదాంత కంపెనీలదే పూర్తి హవా నడుస్తోంది. దేశీయ మొత్తం ఉత్పత్తిలో 90 శాతానికి పైగా వాటా ఈ రెండు సంస్థలదే. మైనింగ్, రిఫైనరీ, పవర్ ప్లాంట్, లాజిస్టిక్స్ వంటి భారీ నెట్‌వర్క్ అవసరం కాబట్టి ఈ రంగంలో కొత్త ప్లేయర్స్ రావడం అంత సులువు కాదు. కానీ అదానీ గ్రూప్ ఒడిశాలో పూర్తి స్థాయి ఇంటిగ్రేటెడ్ ప్లాంట్‌ను నిర్మిస్తోంది. ఇందులో ఏటా 40 లక్షల టన్నుల సామర్థ్యం గల అల్యూమినా రిఫైనరీ, 20 లక్షల టన్నుల అల్యూమినియం స్మెల్టర్, 4000 మెగావాట్ల పవర్ ప్లాంట్‌తో పాటు 10 లక్షల టన్నుల డౌన్‌స్ట్రీమ్ మాన్యుఫ్యాక్చరింగ్ పార్క్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో ఏడాదికి 42 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతుండగా.. అదానీ ప్లాంట్ ద్వారా మరో 20 లక్షల టన్నుల అదనపు ఉత్పత్తి రానుంది.

అసలు వ్యూహం ఇదే..

భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తి దేశమైనప్పటికీ, దేశీయ అవసరాల కోసం ఇప్పటికీ దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రస్తుతం దేశంలో అల్యూమినియం వినియోగం 55 లక్షల టన్నులుగా ఉండగా.. అది 2030 నాటికి 85 లక్షల టన్నులకు, 2047 నాటికి 2.8 కోట్ల టన్నులకు చేరుకుంటుందని అంచనా. ప్రపంచ సగటు ప్రతి వ్యక్తి వినియోగం 8-12 కిలోలు ఉంటే.. భారత్‌లో అది కేవలం 3.4 – 3.9 కిలోలు మాత్రమే ఉంది. భవిష్యత్తులో వాహనాలు, ఎలక్ట్రిక్ వైర్లు, నిర్మాణ రంగానికి రాబోయే భారీ డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడమే తమ లక్ష్యమని కరణ్ అదానీ స్పష్టం చేశారు. అల్యూమినియం తయారీలో అత్యధిక ఖర్చు విద్యుత్ కోసమే అవుతుంది. అదానీ గ్రూప్‌నకు ఇప్పటికే దేశంలో భారీ పవర్ జనరేషన్ పోర్ట్‌ఫోలియో ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం 4 గిగావాట్ల క్యాప్టివ్ పవర్ ప్లాంట్‌తో పాటు 400 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని కూడా వాడుకోనున్నారు. ఈ చౌక విద్యుత్ అదానీకి మార్కెట్లో పెద్ద అడ్వాంటేజ్‌గా మారనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే భారత దేశంలోని సగానికి పైగా బాక్సైట్ నిల్వలు ఒడిశాలోనే ఉన్నాయి. రాయగడ జిల్లాలోని మైన్స్‌కు దగ్గరగా రిఫైనరీ, సుందర్‌గఢ్‌లో స్మెల్టర్ ప్లాంట్‌ను ప్లాన్ చేశారు. ముడిసరుకు రవాణా కోసం అదానీ గ్రూప్‌నకు చెందిన ‘ధామ్రా పోర్ట్’ను, ప్రత్యేక రైల్వే కన్వేయర్ బెల్ట్ నెట్‌వర్క్‌ను ఉపయోగించనున్నారు.