వెండితెర మీదే కాదు బుల్లితెర మీద కూడా నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు మానస్. బాల నటుడిగా తెలుగు తెర మీదకు వచ్చి, అంచెలంచెలుగా ఎదుగుతూ హీరో స్థాయికి చేరుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ మేట్స్ లో మెచ్యూర్డ్ పర్శన్స్ జాబితా వేస్తే అందులో మానస్ పేరు ముందు ఉంటుంది. అలాంటిది ఈ వారం మానస్ ను ఇంటి సభ్యులలో ఏకంగా ఐదుగురు నామినేట్ చేయడం చర్చనీయాంశం అయ్యింది. గతంలో షణ్ముఖ్, సిరి, జెస్సీ ముగ్గురూ గ్రూప్ గా ఏర్పడి ఎలాంటి చెడ్డ పేరు తెచ్చుకున్నారో, ఇప్పుడు సన్నీ, మానస్ ఒకట్టై ఇతరులకూ దూరమై పోయినట్టు గత వారం జరిగిన టాస్క్ లతో తేటతెల్లమైపోయింది. దీంతో సన్నీకంటే మానస్ కు ఎక్కువ బ్యాడ్ నేమ్ వచ్చేసింది. సోమవారం జరిగిన బిస్ బాస్ నామినేషన్స్ ప్రక్రియలో శ్రీరామ్, రవి, జెస్సీ, విశ్వ, షణ్ముఖ్… మానస్ ను నామినేట్ చేశారు.
ఇందులో శ్రీరామ్, జెస్సీలను మానస్ నామినేట్ చేశాడు కాబట్టి వారూ చేశారనే అనుకోవాల్సి ఉంటుంది. ఇక సన్నీని సిరి, శ్రీరామ్, జెస్సీ నామినేట్ చేశారు. శ్రీరామ్ ను మానస్, కాజల్ నామినేట్ చేశారు. జెస్సీని మానస్, సన్నీ నామినేట్ చేశారు. కాజల్ ను రవి, యానీ నామినేట్ చేయగా, ప్రియాంకను షణ్ముఖ్, విశ్వ నామినేట్ చేశారు. అలానే సిరిని యాని, సన్నీ నామినేట్ చేశారు. విశ్వను, యానీని ఒకరొక్కరే నామినేట్ చేయడం విశేషం. చిత్రంగా కెప్టెన్ గా ఉన్న షణ్ముఖ్ ను తప్పించి, మిగిలిన ఇంటి సభ్యులు పది మంది నామినేషన్స్ లో ఉన్నట్టు చివరిలో బిగ్ బాస్ ప్రకటించాడు.
ఈసారి నామినేషన్స్ సమయంలో ప్రియాంక, యానీ పాత్రను పోషించింది. రవితో తాను మానసికంగా, శారీరకంగా పోటీ పడలేనంటూ అతన్ని నామినేట్ చేసింది. షణ్ణు ప్రియాంకను నామినేట్ చేస్తూ, నీ ఆట నువ్వు సరిగా ఆడటం లేదని చెప్పడాన్ని ప్రియాంక ఖండించింది. బాగా ఆడమని ఓ పక్క చెబుతూ, తనను నామినేట్ చేసి హౌస్ నుండి బయటకు పంపేస్తే ఇంకా ఎలా ఆడతానంటూ ఎదురు ప్రశ్నించింది. ఇదే విధంగా నామినేషన్స్ సమయంలో శ్రీరామ్, మానస్; శ్రీరామ్ – కాజల్ సైతం వాదోపవాదాలకు దిగారు. మొత్తం మీద ఈసారి నామినేషన్స్ లో సభ్యుల ప్రవర్తన కంటే… గ్రూపిజమ్ ఎక్కువ డామినేట్ చేసినట్టు తెలిసి పోతోంది. ఒకప్పుడు మానస్ తో గుడ్ రిలేషన్ షిప్ మెయిన్ టైన్ చేసిన శ్రీరామ్ ఈ వారం నామినేషన్స్ సందర్భంగా మానస్ ఒకటి కాదు ఐదారు మాస్కులు ధరించాడని ఆరోపించడం చిత్రంగా అనిపించింది.