బిగ్ బాస్ సీజన్ 5 ముగింపుకు వస్తున్న క్రమంలో ఎవరికి వారు ఇండివిడ్యుయల్ గేమ్ ఆడటం స్టార్ట్ చేశారు. ఇంతవరకూ గ్రూప్స్ కట్టిన వారంతా అందులోంచి నిదానంగా బయటకు వస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్ లో మానస్ ప్రియాంకపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ట్రాన్స్ జండర్ అయిన పింకీ పట్ల మొదటి నుండి మానస్ కు సాఫ్ట్ కార్నర్ ఉంది. దాంతో ఆమెకు మానసికంగా దగ్గరయ్యాడు. ప్రేమలాంటి బాండింగ్ ఏర్పడకపోయినా, తనకు ఆమె మంచి స్నేహితురాలు అనే విషయాన్ని మానస్ అంగీకరిస్తాడు. కానీ ఇదే సమయంలో పింకీతో గడిపిన 11 వారాల అనుభవంతో ఆమె క్యారెక్టర్ ను మానస్ బాగానే స్టడీ చేశాడు. ఇక శుక్రవారం ప్రియాంక చెల్లెలు మధు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది. ఆమె అందులోకి అడుగుపెట్టిన దగ్గర నుండి వెళ్ళిపోయే వరకూ మానస్ కు సారీ చెబుతూనే ఉంది. అలా నాలుగైదు సార్లు చెప్పడంతో చివరకు పింకీ చెల్లి మానస్ కు ఎందుకు సారీ చెప్పిందనేది చర్చనీయాంశంగా మారిపోయింది.
Read Also : టాలీవుడ్ లో విషాదం… ప్రముఖ దర్శకుడు కన్నుమూత
మానస్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి దగ్గరకు వెళుతుంటే, పింకీ నివారించిందని, అందుకే ఆమె మానస్ కు సారీ చెప్పిందని చివరకు తేల్చారు. అయితే, పింకీ విషయంలో మానస్ కు కొన్ని నిర్థిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయనేది కూడా శుక్రవారం తెలిసింది. పింకీ చాలా స్ట్రాంగ్ అని చెబుతూనే, ఆమె విపరీతంగా అబద్ధాలు చెబుతుందనే విషయాన్ని మానస్ బయట పెట్టాడు. సో… ఇంతకాలం ఆటల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పింకీకి సాయం చేస్తూ వచ్చిన మానస్, ఇప్పుడు ఒక్కసారి ఆమె మీద ఇంత తీవ్రమైన ఆరోపణ చేయడం ఆశ్చర్యంగానే ఉంది. ఒకవేళ ఈ విషయం పింకీ దృష్టిలోకి వెళితే ఆమె ఎంత వైల్డ్ గా రియాక్ట్ అవుతుందో ఊహించుకోవచ్చు. అదే జరిగితే, పింకీ – మానస్ మధ్య పెద్ద అగాధం ఏర్పడం ఖాయం. బిగ్ బాస్ హౌస్ లో ఉండగానే ఇదే జరిగే ఆస్కారం కూడా కనిపిస్తోంది.