గత పది రోజులుగా వెర్టిగో తో బాధపడుతున్నాడు జస్వంత్. అయితే పంటి బిగువున బాధను భరిస్తూనే, కొన్ని టాస్క్ లలో పాల్గొంటున్నాడు. ఇతర ఇంటి సభ్యుల సహకారంతో రోజులు నెట్టుకొస్తున్నాడు. వారం రోజులు దాటిపోయినా జెస్సీ ఆరోగ్యంలో మెరుగుదల లేకపోవడంతో నిన్న ప్రసారం చేసిన ఎపిసోడ్ లో ట్రీట్ మెంట్ చేస్తున్న డాక్టర్ ను కూడా వీక్షకులకు బిగ్ బాస్ టీమ్ చూపించింది. అయితే.. ఇవాళ జెస్సీని బిగ్ బాస్ అనారోగ్య కారణంగా ఇంటి నుండి బయటకు పంపేశాడు. దాంతో మిగిలిన సభ్యులంతా కన్నీటి పర్యంతమయ్యారు. సిరి, షణ్ముఖ్ పరిస్థితి ఏమిటనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షణ్ణుతో విభేదించిన ప్రతి సందర్భంలోనూ ఆమెను జెస్సీని ఓదార్చుతూ ఉండేవాడు. ఒకానొక సమయంలో సిరి, జెస్సీ ఒక్కటైపోయి, తనను దూరం పెట్టారనే అభద్రతాభావానికి షణ్ణు వచ్చాడు. అయితే సిరిని తిరిగి దగ్గరకు తీసుకున్న షణ్ణు, జెస్సీని మాత్రం కాస్తంత దూరంగానే పెట్టాడు. లేదంటే… జెస్సీనే షణ్ముఖ్ తో వ్యూహాత్మక దూరం పాటించాడని అనుకోవాలి.
ఏదేమైనా జెస్సీ వెళ్ళిపోవడం చాలామందికి బాధను కలిగించింది. ఇదే సమయంలో అతను బయటకు వెళ్లడాన్ని గత సీజన్ లో నోయల్ వాకౌట్ తో పోల్చుతున్నారు కొందరు. బిగ్ బాస్ సీజన్ 4లో నోయల్ సైతం 53వ రోజు అనారోగ్యంతో డాక్టర్ కు చూపించుకోవడానికి బయటకు వెళ్ళాడు. కానీ ఆ తర్వాత అతను తిరిగి రాలేదు. కానీ ఇప్పుడు జెస్సీని మాత్రం హాస్పిటల్ కు పంపి, తిరిగి రీ-ఎంట్రీ ఛాన్స్ ఇస్తారని కొందరు అంటుంటే, లోబో తరహాలో జెస్సీని సీక్రెట్ రూమ్ కి పంపే ఆస్కారం ఉందని మరి కొందరు అంటున్నారు. అయితే… జెస్సీ ఒక్కడినే అలా ఒంటరిగా సీక్రెట్ రూమ్ లో ఉంచడం కూడా కరెక్ట్ కాదని, కాబట్టి అతన్ని హాస్పిటల్ లో చేర్చడానికే బయటకు పంపారనే వారూ లేకపోలేదు. చూద్దాం… ఏం జరుగుతుందో!!