Ratha Saptami: నేడు రథ సప్తమి. అన్ని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు అన్ని దేవుళ్లను దర్శించుకుంటున్నారు. సూర్య భగవానుడికి పూజలు చేస్తున్నారు. అయితే.. ఇంతకీ రథ సప్తమి విశిష్టత ఏంటి? ఎందుకు జరుపుకొంటారో ఇప్పుడు తెలుసుకుందాం.. రథ సప్తమి అనగా సూర్యుడు ఉద్భవించిన రోజు. హిందువులు మాఘ శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటారు. సూర్యభగవానుడు కశ్యప మహాముని కుమారుడు. తేజోవంతుడు, దేవతామూర్తి. లోకసాక్షి అయిన ఆ సూర్య భగవానుని అర్చించి ఆయన కరుణా కటాక్షాలను పొందే సుదినమే మాఘ శుద్ధ సప్తమి. అదే సూర్యుడి జన్మతిథి..
READ MORE: Valentine’s Day : వాలెంటైన్స్ వీక్ స్పెషల్.. థియేటర్లలో మళ్లీ ఐదు క్రేజీ సినిమాలు రీ-రిలీజ్ !
రథసప్తమినాడు సూర్యోదయానికి పూర్వమే స్నానాదికాలు చేసి, సూర్యోదయానంతరము దానాలు చేయాలి. ఈ రోజు సూర్యభగవానుని ఎదుట ముగ్గువేసి, ఆవు పిడకలపై ఆవుపాలతో పొంగలి చేసి చిక్కుడు ఆకులపై ఆ పొంగలిని ఉంచి ఆయనకు నివేదన ఇవ్వాలి. ఇతర మాసములలోని సప్తమి తిథుల కన్నా మాఘమాసమందలి సప్తమి తిథి బాగా విశిష్టమైనది. సూర్యుని గమనం ఏడు గుర్రములు పూన్చిన బంగారు రథము మీద సాగుతుందని వేదము “హిరణ్యయేన సవితా రథేన” అని తెలుపుతుంది. సూర్య గమనం ప్రకారము ఉత్తరాయన(ణ)ము, దక్షిణాయనము అని రెండు విధాలుగా ఉంటుంది. ఆషాఢ మాసము నుంచి పుష్యమాసము వరకు దక్షిణాయనము, సూర్యరథము దక్షిణాయనములో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకర రాశి ప్రవేశముతో ఉత్తరాయన ప్రారంభమవుతుంది. అందుకే ఆరోజు పవిత్ర దినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. “భా” అంటే సూర్యకాంతి. “కతి” అంటే సూర్యుడు. మనకు కనిపించే ప్రత్యక్ష దైవము సూర్య భగవానుడు. నిత్యం మనము చేసే అన్ని పనులకు ఆయనే ప్రత్యక్ష సాక్షి. సూర్యుడే సమస్త జీవరాశికి ఆయురారోగ్య ప్రదాత. సూర్యచంద్రులు లేనిదే ఈ విశ్వమే లేదు. అందుకే ఈ రోజున సూర్యునికి సంబంధించిన ఒక్క ప్రార్థనా శ్లోకమైనా చదవాలి. కింద సూర్య భగవానుడి శ్లోకాలు ఉన్నాయి. చదవండి.. ఆయనను స్మరించుకోండి!
ఆదిదేవ నమస్తుభ్యమ్ ప్రసీద మమ భాస్కరా!
దివాకర నమస్తుభ్యమ్ ప్రభాకర నమోస్తుతే|
ధ్యేయత్ సదా సవితృమండల మధ్యవర్తే!
నారాయణ సరసిజాసన సన్నివిష్టః!
కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటిః!
హారీ హిరణ్మయ వపుధ్రృతః శంఖచక్రః.|
నమః సవిత్రే జగదేక చక్షుసే!
జగత్ ప్రసూతి స్ధితినాశహేతువే!
త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణే!
విరించి నారాయణ శంకరాత్మనే|
నమః సవిత్రే జగదేక చక్షుసే!
జగత్ ప్రసూతి స్ధితినాశహేతువే!
త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణే!
విరించి నారాయణ శంకరాత్మనే|
ఓమ్ నమస్తే బ్రహ్మ రూపాయ!
ఓమ్ నమస్తే విష్ణు రూపాయ!
ఓమ్ నమస్తే రుద్రరూపాయ!
భాస్కరాయ నమోనమః. |
ఉదయస్తు బ్రహ్మ రూపేషు!
మధ్యాహ్నేతు మహేశ్వరః!
సాయంకాలే సదావిష్ణుః!
త్రిమూర్తిస్తు దివాకరః|