Ratha Saptami: హిందూ సంప్రదాయాలలో సూర్యారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే, మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే సప్తమి తిథిని ‘రథ సప్తమి’ అని పిలుస్తారు. ఇది సూర్య భగవానుడి జన్మదినంగా చెబుతారు. నేడు అలాంటి పవిత్రమైన రోజు. ఈ రోజున కొన్ని పనులు చేయకూడని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజున ఆలస్యంగా నిద్రలేవడం, మాంసాహారం, మద్యం సేవించడం, కలహాలు, కోపం, దుర్వాక్యాలు మాట్లాడటం, అపవిత్ర ఆలోచనలు వంటివి చేయకూడదని స్పష్టం చేస్తున్నారు. సూర్యోదయం తర్వాత నిద్రలేవడం అశుభమని.. ఇలాంటి వారికి దరిద్రం వెంటే ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మనసును శాంతంగా, సాత్వికంగా ఉండటం, మనసును శుద్ధిగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
READ MORE: Deputy CM Pawan: నేడు నాందేడ్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పర్యటన
కాగా.. రథ సప్తమి రోజు చేసే స్నానం, దానం ఏడు జన్మల పాపాలు, దోషాలు, దరిద్రాలను తొలగింపజేస్తుందట! అందువల్ల రథ సప్తమి రోజు ప్రత్యేకంగా స్నానం చేయాలని మాచిరాజు తెలిపారు. ఇందుకోసం ఏడు జిల్లేడు ఆకులు, 7 రేగి పళ్లు తీసుకోవాలి. వాటిని శిరస్సుపై ఉంచి తలంటు స్నానం చేయాలని చెప్పారు. ఇక్కడ జిల్లేడు ఆకులు, రేగి పళ్లు తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, అవి సూర్యుడికి ఇష్టమైనవి. ఈ విధమైన ప్రత్యేక స్నానం ఏడు రకాలైన పాపాలను తొలగిస్తుందట. రథ సప్తమి రోజు స్నానం చేసిన తర్వాత సూర్యుడిని ఆరాధించాలి. ఇందుకోసం వీలైతే మీ ఇంటి ఆవరణలో చిక్కుడు ఆకులు, చిక్కుడు పూలు, చిక్కుడు కాయలు వీటిని కలిపి ఒక మండపం లాగా పెట్టాలి. ఆ మండపం దగ్గర సూర్యుడి ఫొటో ఉంచాలి. ఇవన్నీ కుదరకపోతే పూజ గదిలో ఒక తమలపాకు తీసుకుని దానిపై తడి గంధంతో గుండ్రంగా ఒక రూపు గీయండి. దానిని సూర్యుడిగా భావించాలి. మీ దగ్గర సూర్య భగవానుడి ఫొటో ఉంటే పెట్టండి. అక్కడ గోధుమలతో తయారు చేసిన పదార్థం నైవేద్యంగా పెట్టాలి. వీలైతే ఆవు పాలతో పాయసం చేస్తే మంచిది. పూజ కార్యక్రమాలు ముగిసిన తర్వాత కుటుంబ సభ్యులు ప్రసాదం స్వీకరించాలి. సూర్య భగవానుడికి ప్రీతికరమైన రథ సప్తమి రోజున ఎవరికైనా ఒకరికి గొడుగు, చెప్పులు దానం ఇవ్వడం వల్ల జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయని మాచిరాజు కిరణ్ కుమార్ తెలిపారు. సూర్యుడి సంపూర్ణ అనుగ్రహం లభించి అదృష్టం బాగా కలిసి వస్తుందని పేర్కొన్నారు. జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారని చెప్పారు.