

ఎనిమిదవ రోజు కోటి దీపోత్సవంలో ఉడిపి పెజావర్ అధోక్షజ మఠం, శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామి భక్తులనుద్ధేశించి అనుగ్రహభాషణం చేయగా,శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు కోటి దీపోత్సవానికి విచ్చేసిన భక్తులని ఉద్దేశించి పరమేశ్వరుని కరుణామృత వర్షం లో తడుస్తూ భక్తి శ్రద్ధ లతో కూర్చున్న మీ భాగ్యం ఇంతా అంతా కాదు అనీ ,ఇలాంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఏ యోగ సాధన చేయకుండానే అన్ని యోగ సిద్ధులు భక్తులకు కలుగుతాయి అనీ ప్రవచనామృతం చేశారు.

ముఖ్య అతిథి గా హాజరైన ఆంధ్రప్రదేశ్ హై కోర్టు న్యాయ మూర్తి జస్టిస్ శ్రీ సి ప్రవీణ్ కుమార్ గారిని భక్తిటీవీ, ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి ని సగౌరవంగా సత్కరించారు.


వీటితో పాటు గా వేదికపై కైలాసం నుంచే దిగివచ్చారా అన్నంత కన్నుల పండుగ గా శ్రీ శ్రీ శైల భ్రమరాంబా సమేత శ్రీ మల్లిఖార్జున స్వామి వార్ల కల్యాణం జరిగింది .


అనంతరం అత్యద్భుతమైన కార్తీక పౌర్ణమి పుణ్య దినాన జరిగే విశేషమైన జ్వాలా తోరణం గుండా శ్రీ శ్రీ శైల భ్రమరాంబా సమేత శ్రీ మల్లిఖార్జున స్వామి వార్ల నంది వాహన సేవలు జరిగాయి. ఇవికాక ప్రతిరోజూ జరిగే జ్యోతి ప్రజ్వలన, బంగారు లింగోద్భవం, మహా నీరాజనం, వచ్చిన అతిథులకు గురు వందనం, గౌరవ సత్కారాలు, సప్త హారతి వంటి కార్యక్రమాలు జరిగాయి.
