Kartika Purnima: కార్తీక మాసం… శివపార్వతుల అనుగ్రహాన్ని అందించి.. ఆధ్యాత్మిక శక్తితో నింపే ఓ పవిత్రమైన నెల. ఈ మాసంలో దీపారాధన, నదీ స్నానాలు, ఉపవాసాలు వంటి ఎన్నో ఆచారాలు ఉన్నప్పటికీ.. వీటన్నింటిలోనూ ఉసిరి వృక్షం, దాని ఫలం యొక్క పాత్ర అసాధారణమైనది. కేవలం పూజలకే కాదు.. మన ఆరోగ్యం, పర్యావరణానికి కూడా మేలు చేసే ఈ ఉసిరి ప్రాముఖ్యత కార్తీకంలో ఎందుకంత విశేషంగా ఉందో తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం, కార్తీక మాసంలో ఉసిరికాయకు ప్రత్యేక స్థానం ఉంది. స్కంద పురాణం ప్రకారం సాక్షాత్తు ఉసిరి చెట్టులో శివపార్వతులతో పాటు బ్రహ్మ, సకల దేవతలు నివసిస్తారు. అందుకే కార్తీక పౌర్ణమి, సోమవారాలు, ఏకాదశి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే త్రిమూర్తుల అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఈ పవిత్రమైన రోజుల్లో శివాలయాల్లో వెలిగించే 365 వత్తుల దీపారాధనతో పాటు ఉసిరి దీపం కూడా ప్రధానమైనదిగా భావిస్తారు.
ఉసిరి దీపారాధన వెనుక ఒక పురాణ కథ ఉంది. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు.. కార్తీక మాసంలో శివుడిని పూజించడానికి ఆలయం లేక ద్రౌపది బాధపడింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు ఉపదేశిస్తూ.. జూదంలో ఓడిపోయి కష్టాలు పడుతున్న పాండవులకు, గ్రహాల చెడు ఫలితాల నుంచి ఉపశమనం లభించడానికి కార్తీక మాసంలో ఉసిరి కాయ, ఆవు నెయ్యితో దీపం వెలిగించాలని సూచించాడు. పద్మపురాణం ప్రకారం ఈ దీపారాధన నవగ్రహ దోషాలను పరిహరిస్తుంది.
ఇక కార్తీక మాసం అనగానే గుర్తుకొచ్చే మరో ముఖ్యమైన ఆచారం వనభోజనాలు. పురాణాలలో నైమిశారణ్యంలో మునులు, శ్రీకృష్ణుడు నందగోప బాలురతో కలిసి వనభోజనం చేసినట్లు వివరించబడింది. అర్చకుల ప్రకారం ఈ మాసంలో ముఖ్యంగా ఉసిరి చెట్టు నీడలో భోజనం చేయడం అత్యంత విశేష ఫలితాలను అందిస్తాయని తెలిపారు. హిందూ పురాణాలలో ఉసిరి చెట్టును ‘దాత్రి’ అని పిలుస్తారు, అంటే క్షమించే గుణానికి ప్రతీక. దీనిని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణిస్తారు. ఈ మాసంలో వనంలో ఉసిరి చెట్టు కింద ధాత్రి కళ్యాణం (ఉసిరి కొమ్మను విష్ణువుగా, తులసి కొమ్మను లక్ష్మీదేవిగా భావించి చేసే కళ్యాణం) జరిపించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి.