Site icon NTV Telugu

Koti Deepotsavam 2022: 9వ రోజు కన్నుల పండువగా కార్తీక దీపోత్సవం

Sri Kalahasti Kalyanam

Sri Kalahasti Kalyanam

Koti Deepotsavam 2022:  అక్టోబర్ 31వ తేదీన ప్రారంభమైప భక్తి టీవీ కోటి దీపోత్సవం 9వ రోజుకి చేరింది. ఈ నెల 14వ తేదీ వరకు ఈ మహా క్రతువు సాగనుంది. మంగళవారం నాడు కోటి దీపోత్సవం కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. ఈరోజు తొలుత డా.శంకరమంచి రామకృష్ణశాస్త్రి స్తోత్ర పారాయణం చేశారు. అనంతరం కోటి దీపోత్సవ ప్రాంగణంలో గ్రహణమోక్ష అనంతరం నదీజలాలతో మహా సంప్రోక్షణ చేశారు. చిట్యాలకు చెందిన శ్రీ హరిహర స్మార్థ వేదపాఠశాల విద్యార్థులు వేదపఠనం చేశారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత డా.గరికపాటి నరసింహారావు ప్రవచనామృతం చేశారు, శ్రీ పరిపూర్ణానందగరి స్వామిజీ వారు (ఏర్పేడు, వ్యాసాశ్రమం), శ్రీ అసంగానందగిరి స్వామీజీ (ఏర్పేడు, ఉత్తరాధిపతి వ్యాసాశ్రమం), శ్రీవ్రతధర రామానుజ జీయర్ స్వామీజీ (హైదరాబాద్, జగన్నాథమఠం) అనుగ్రహ భాషణం చేశారు.

ఈరోజు కోటిదీపోత్సవం కార్యక్రమానికి టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి, కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం శ్రీ పరిపూర్ణానందగిరి స్వామీజీ వారికి గురు వందనం, శ్రీ అసంగానందగిరి స్వామీజీ వారికి గురు వందనం, శ్రీ వ్రతధర రామానుజ జీయర్ స్వామీజీ వారికి గురు వందనం జరిగాయి. పూణే డోల్ వాయిద్యం, పంబమేళా, సాంస్కృతిక కదంబం వంటి కార్యక్రమాలు భక్తులను అలరించాయి. చంద్రగ్రహణం ముగియడంతో శ్రీకాళహస్తీశ్వరస్వామి కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. తర్వాత అశ్వవాహన సేవ, సింహ వాహన సేవలను వైభవంగా నిర్వహించారు. గంగానది నుంచి తెచ్చిన దివ్యజలంతో సంప్రోక్షణ జరిగింది. ఈ సందర్భంగా ఓం నమః శివాయ నామస్మరణతో మారుమ్రోగింది. వాహన సేవల్లో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. కోటి దీపోత్సవంతో ఎన్టీఆర్ స్టేడియం అంతా దేదీప్యమానంగా వెలిగింది. ఇల కైలాసంగా విలసిల్లింది.

Exit mobile version