Top 5 Electric SUVs Coming to India in 2026: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఏటా పెరుగుతున్నాయి. టాటా వంటి కంపెనీలు ఇప్పటికే పలు ఈవీలు విక్రయిస్తున్నాయి. అలాగే మరిన్ని మోడళ్లను తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. కానీ మారుతి వంటి కొన్ని బ్రాండ్లు ఇప్పటికీ పూర్తిగా ఈవీ విభాగంలోకి రాలేదు. ప్రపంచవ్యాప్తంగా SUVsకి డిమాండ్ పెరుగుతుండటంతో ఈ కార్ కంపెనీలు భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. అయితే.. తాజాగా కంపెనీల వ్యూహాలు మారుతున్నాయి. 2026లో భారత మార్కెట్‌లో ఐదు ప్రధాన ఎలక్ట్రిక్ SUV మోడళ్లు విడుదలయ్యే అవకాశం ఉంది.
మారుతి ఈ విటారా..
మారుతి నుంచి రానున్న e Vitara ఎలక్ట్రిక్ SUV వచ్చే ఏడాది మార్కెట్‌లోకి రానుంది. ఇది బహుశా జనవరి నుంచే అమ్మకాలకు అందుబాటులో ఉండొచ్చు. ఈ కారు రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. ఒకటి 49 kWh బ్యాటరీ, ఇది సింగిల్ మోటార్‌తో వస్తుంది. ఇంకొకటి పెద్ద 61 kWh బ్యాటరీ, ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ లేదా ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్లతో ఉండొచ్చు. చిన్న బ్యాటరీతో సుమారు 346 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. 61 kWh బ్యాటరీతో సుమారు 428 కిలోమీటర్ల వరకు వెళ్లే అవకాశం ఉంది. అయితే ఇండియాలో AWD వెర్షన్ వస్తుందా లేదా అనేది ఇంకా ఖరారు కాలేదు.
టాటా సియెర్రా EV..
టాటా సియెర్రా EV 2026 మార్చి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. మొదట పెట్రోల్/డీజిల్ వెర్షన్ మార్కెట్‌లోకి వస్తుంది. అనంతరం ఎలక్ట్రిక్ వెర్షన్ త్వరలోనే షోరూములకు చేరే అవకాశం ఉంది. ఈఎలక్ట్రిక్ సియెర్రా సింగిల్ మోటార్ రియర్ వీల్ డ్రైవ్, డ్యుయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్లతో రానుంది. దీనివల్ల ఆఫ్-రోడ్ సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ కారులో ముందు భాగంలో ఫ్రంక్ (ఫ్రంట్ బూట్), వన్-పెడల్ డ్రైవింగ్, వాహనం నుంచి పరికరాలకు కరెంట్ ఇవ్వగల V2L ఫీచర్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉండే అవకాశం ఉంది.
మహీంద్రా XUV 3XO EV..
మహీంద్రా XUV 3XO EV కూడా భారత మార్కెట్‌కు రానుంది. ఇది టాటా నెక్సాన్ EVకి నేరుగా పోటీగా ఉంటుంది. ఇది XUV400 కంటే చిన్నదిగా, ధర తక్కువగా ఉండేలా రూపొందిస్తున్నారు. ఇందులో సుమారు 35 kWh బ్యాటరీ ఉంటుందని అంచనా. దీని ద్వారా దాదాపు 400 కిలోమీటర్ల రేంజ్ రానుంది. 2026 మొదటి భాగంలోనే ఈ కారు భారత మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.
కియా సైరొస్ EV..
కియా సైరొస్ EV 2026 మార్చి నాటికి భారత మార్కెట్‌లోకి రావచ్చు. ఈ కారును ఇప్పటికే టెస్టింగ్ సమయంలో గుర్తించారు. దీని డిజైన్ సాధారణ (ICE) వెర్షన్‌లాగే ఉంటుంది. కానీ ఎలక్ట్రిక్ కారులకు సంబంధించిన కొన్ని ప్రత్యేక డిజైన్ అంశాలు ఉంటాయి. ఛార్జింగ్ పోర్ట్ ముందు భాగంలో ఉండే అవకాశం ఉంది. లోపలి భాగం కూడా సాధారణ వెర్షన్‌లాగే ఉండే అవకాశం ఉంది. ఈ కారు టాటా నెక్సాన్ EVకి పోటీగా ఉంటుంది. హ్యూండాయ్ K1 ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తుందని సమాచారం.
READ MORE: Whats Today: ఈరోజు ఏమున్నాయంటే?
హ్యూండాయ్ ఇన్స్టర్ EV..
హ్యూండాయ్ ఇన్స్టర్ EV 2026 చివరి నాటికి భారత మార్కెట్‌లోకి రావచ్చు. ఇది టాటా పంచ్ EVకి నేరుగా పోటీగా ఉంటుంది. ఈ కారు తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ ప్లాంట్‌లో తయారు చేయనున్నారు. ఇందులో భారతదేశంలో తయారైన ఎక్సైడ్ బ్యాటరీలు ఉపయోగిస్తారు. అంతర్జాతీయంగా ఉన్న ఇన్స్టర్ EV ఆధారంగా ఈ కారు రూపొందించబడింది. ఇది 42 kWh మరియు 49 kWh బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. వీటితో సుమారు 300 నుంచి 355 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగలదు. ఇందులో రెండు పెద్ద డిస్‌ప్లేలు, లెవల్ 2 ADAS సేఫ్టీ సిస్టమ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది.
