NTV Telugu Site icon

Tata Tiago EV: టాటా టియాగో ఈవీ వచ్చేసింది.. ధర, ప్రత్యేకతలు ఇవే..

Tiago Ev 3

Tiago Ev 3

Tata Tiago EV: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మరో ఎలక్ట్రిక్ వాహనాన్ని మార్కెట్ లోకి తీసుకువచ్చింది.. టాటా టియాగో ఈవీ ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అయింది.. ఇప్పటి వరకు కాంపాక్ట్ ఎస్ యూ వీ సెగ్మెంట్ లోనే వివిధ కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను తీసుకువచ్చాయి. అయితే తొలిసారిగా హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ఎలక్ట్రిక్ కారును టాటా తీసుకువచ్చింది. ఇప్పటికే టాటా నుంచి నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీలు మార్కెట్ లో ఉన్నాయి. అయితే తాజాగా టియాగో ఈవీని మార్కెట్ లో విడుదల చేసింది.

కొత్త టియాగో ఈవీ ధర రూ.8.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఫీచర్లను బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 315 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చేలా కార్ ను తీర్చిదిద్దారు. అయితే రెండు బ్యాటరీ ఆప్షన్లతో టియాగో ఈవీ వస్తోంది. ఒకటి 315 కిలోమీటర్ల రేంజ్ ఇస్తే.. మరొక బ్యాటరీ ఆప్షన్ లో 250 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వనుంది. ఐపీ67 రేటెడ్ బ్యాటరీ ప్యాక్ ( వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్)ను టియాగో ఈవీలో అమర్చారు.

24 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ 315 కిలోమీటర్ రేంజ్ ఇస్తే.. 19.2 కిలోవాట్ అవర్ 250 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని అంచనా. 3.3 కిలో వాట్ ఏసీ ఛార్జర్, 7.2 కిలో వాట్ ఏసీ హోమ్ ఫాస్ట్ ఛార్జర్ల ద్వారా బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా బ్యాటరీని (10% – 100% వరకు) 3.36 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. 7.2 కిలోవాట్ ఏసీ ఛార్జర్ ద్వారా 30 నిమిషాలు ఛార్జ్ చేస్తే 35 కిలోమీటర్ల రేంజ్ పొందవచ్చు. అలాగే.. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా 30 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే 110 కిలోమీటర్ల రేంజ్ పొందవచ్చు. దీని ద్వారా కేవలం 57 నిమిషాల్లోనే 80 శాతం బ్యాటరీని ఛార్జింగ్ చేయవచ్చు.

మొత్తం ఐదు రంగుల్లో కారు అందుబాటులో ఉంది. టీల్ బ్లూ, డేటోనా గ్రే, ప్రిస్టైన్ వైట్, మిడ్‌నైట్ ప్లం, ట్రాపికల్ మిస్ట్ కలర్స్ అందుబాటులో ఉన్నాయి. సిటీ, స్పోర్ట్స్ డ్రైవింగ్ మోడ్స్ టియాగో కారులో ఉన్నాయి. ప్రతీ మోడ్ లో ఫోర్ లెవల్ రీజెనరేషన్ సెట్టింగ్స్ ఉన్నాయి.

ప్రస్తుతం ఇండియా మార్కెట్ లో అతి తక్కువ ధరకు లభించే ఈవీ కారుగా టియాగో నిలవబోతోంది. కేవలం 10 లక్షల లోపే ఈవీ కారును టాటా అందిస్తోంది. ప్రస్తుతం ఇండియాలో ఎక్కువగా అమ్ముడవుతున్న ఈవీ కారు కూడా టాటాకు చెందిన నెక్సాన్ ఈవీనే. నెక్సాన్ ఈవీతో పాటు ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో ఎంజీ జెడ్ఎస్ ఈవీ, హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్, టాటా టిగోర్ కార్లు ప్రధానంగా ఉన్నాయి.