Tata Tigor: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ పాసింజర్స్ వాహనాల పోర్టుఫోలియోను విస్తరిస్తోంది. ఈ ఇందులో భాగంగా తాజాగా టాక్సీలకు సరిపోయేలా టాటా ఎక్స్‌ప్రెస్‌ను నూతన హంగులతో విడుదల చేసింది. ఎక్స్‌ప్రెస్ టిగోర్ టాక్సీ సెడాన్‌ను ఇప్పుడు పెట్రోల్, ట్విన్–సిలిండర్ CNG వేరియంట్లలో విడుదల చేసింది. ఇప్పటివరకు ఎలక్ట్రిక్ వెర్షన్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఎక్స్‌ప్రెస్ రేంజ్, ఇకపై ICE ఆప్షన్లతోనూ మార్కెట్లోకి వచ్చింది. ఇది ఫ్లీట్ ఆపరేటర్ల కోసం టాటా మల్టీ–పవర్‌ట్రెయిన్ వ్యూహానికి అనుగుణంగా ఉంది. ఎక్స్‌ప్రెస్ టిగోర్ పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.5.59 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండగా, CNG వేరియంట్ ధర రూ.6.59 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఈ ధరలు ఫ్లీట్ సెడాన్ విభాగంలో పోటీగా ఉన్నాయని టాటా తెలిపింది.
READ MORE: AP Liquor Scam Case: చెవిరెడ్డికి స్వల్ప ఊరట.. ఏసీబీ కోర్టు అనుమతి
పెట్రోల్, CNG మోడళ్ల రెండింటికీ 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించింది. ఇది 86 హెచ్‌పీ పవర్, 113 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సీఎన్జీ కిట్‌కు సంబంధించిన పవర్ గణాంకాలను టాటా ఇంకా వెల్లడించలేదు. ఈ వాహనాలు ప్రధానంగా కమర్షియల్ వినియోగానికి అనుకూలంగా డ్యూరబిలిటీ, నమ్మకత్వం, తక్కువ ఆపరేటింగ్ ఖర్చులపై దృష్టి సారించి రూపొందించారు. పెట్రోల్ వేరియంట్లో 419 లీటర్ల బూట్ స్పేస్ అందుబాటులో ఉంది. సీఎన్జీ మోడల్ బూట్ స్పేస్ వివరాలను వెల్లడించకపోయినా, ఇందులో 70 లీటర్ల వాటర్ కెపాసిటీ కలిగిన ట్విన్ సిలిండర్లు అమర్చారు. ఇది సింగిల్ పెద్ద సిలిండర్‌తో పోలిస్తే తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది.
READ MORE: Thar Roxx Star Edn: స్కైరూఫ్, 360° కెమెరాతో.. థార్ రాక్స్ స్టార్ ఎడిషన్‌ను విడుదల చేసిన మహీంద్రా
డిజైన్ పరంగా, ఈ ICE ఎక్స్‌ప్రెస్ మోడళ్లలో 14 అంగుళాల స్టీల్ వీల్స్ ఉంటాయి (బ్లాక్ వీల్ కవర్స్‌తో). ఇంటీరియర్‌లో డ్యువల్-టోన్ కేబిన్ ఉండగా, ఎలక్ట్రిక్ మోడల్లో ఉన్న ఆడియో సిస్టమ్ ఇందులో ఇవ్వలేదు. టాటా ఈ వాహనాలపై 3 సంవత్సరాలు లేదా 1,00,000 కి.మీ. స్టాండర్డ్ వారంటీ అందిస్తోంది. దీన్ని 5 సంవత్సరాలు లేదా 1,80,000 కి.మీ. వరకు పెంచుకునే అవకాశం ఉంది. అలాగే ఫ్లీట్ కస్టమర్ల కోసం ఫ్లెక్సిబుల్ ఫైనాన్స్ ఆప్షన్లు, ఎంపిక చేసిన నగరాల్లో ప్రత్యేక ఫ్లీట్ డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేసింది. హ్యుందాయ్, టయోటా, మారుతి సుజుకి వంటి సంస్థలు ఇప్పటికే ఫ్లీట్-స్పెసిఫిక్ వాహనాలను తీసుకురాగా, టాటా ఇప్పుడు పెట్రోల్, సీఎన్జీ ఎక్స్‌ప్రెస్ టిగోర్‌తో ఆ పోటీలోకి బలంగా అడుగుపెట్టింది.