32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!

  • మారుతి సుజుకి స్విఫ్ట్‌ CNGలో..
  • తొలిసారిగా ఏజీఎస్‌ (AMT) ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌
  • స్విఫ్ట్‌ CNG-AMT ప్రారంభ ధర రూ.7.92 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)..
Maruti Suzuki Swift Cng Amt

Maruti Suzuki Swift Cng Amt

Maruti Suzuki Swift CNG-AMT: మారుతి సుజుకి స్విఫ్ట్‌ CNGలో తొలిసారిగా ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్విఫ్ట్‌ CNG-AMT పేరుతో విడుదలైన ఈ కొత్త వేరియంట్‌ ప్రారంభ ధర రూ.7.92 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). ఇందులో కంపెనీకి చెందిన ఏజీఎస్‌ (AMT) గేర్‌బాక్స్‌తో పాటు 1.2 లీటర్‌, 3-సిలిండర్‌ జెడ్‌-సిరీస్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంటుంది. CNG మోడ్‌లో ఈ ఇంజిన్‌ 69Bhp శక్తిని, 101.8Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ప్రకటించిన మైలేజీ 32.85 కి.మీ./కిలోగా ఉంది.

2024లో భారత్‌లో విడుదలైన నాలుగో తరం స్విఫ్ట్‌ ఆధారంగానే ఈ CNG-AMT మోడల్‌ను రూపొందించారు. నాలుగో తరం స్విఫ్ట్‌తోనే 1.2 లీటర్‌ జెడ్‌-సిరీస్‌ ఇంజిన్‌ను కంపెనీ తొలిసారిగా పరిచయం చేసింది. ఆ తర్వాత ఇదే ఇంజిన్‌ను డిజైర్‌, అప్‌డేటెడ్‌ బాలెనో వంటి మోడళ్లలోనూ మారుతి సుజుకి ఉపయోగించింది.

డిజైన్‌

స్విఫ్ట్‌ CNG-AMT డిజైన్‌ దాదాపుగా పెట్రోల్‌ వెర్షన్‌ మాదిరిగానే ఉంటుంది. ఇందులో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్‌, ఎల్‌ఈడీ టెయిల్‌ ల్యాంప్స్‌, ఎల్‌ఈడీ ఫాగ్‌ ల్యాంప్స్‌, 15 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ ఉన్నాయి. కారు పక్క భాగాల్లో కనిపించే ర్యాప్‌అరౌండ్‌ క్యారెక్టర్‌ లైన్‌ కూడా కొనసాగింది. CNG బ్యాడ్జింగ్‌ మినహా ప్రత్యేకంగా గుర్తించేలా ఎలాంటి కొత్త డిజైన్‌ మార్పులు చేయలేదు.

CNG సిలిండర్‌ను బూట్‌ లోపల అమర్చారు. కొత్త పవర్‌ట్రెయిన్‌ కోసం కారు బాడీ డిజైన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇంజిన్‌, CNG వ్యవస్థ, ఆటోమేటెడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ వంటి మెకానికల్‌ అంశాల్లోనే ప్రధాన మార్పులు ఉన్నాయి.

ఫీచర్లు

స్విఫ్ట్‌ CNG-AMTలో సుజుకి కనెక్ట్‌ సదుపాయంతో కూడిన టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ ఉంటుంది. ఓవర్‌-ది-ఎయిర్‌ అప్‌డేట్స్‌కు కూడా ఇది సపోర్ట్‌ చేస్తుంది. ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, వెనుక ఏసీ వెంట్స్‌, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, సుజుకి కనెక్ట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. కొత్త ఏజీఎస్‌ గేర్‌బాక్స్‌ కోసం ప్రత్యేక నియంత్రణలు కూడా క్యాబిన్‌లో అందించారు.

భద్రత పరంగా 6 ఎయిర్‌బ్యాగ్స్‌, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ ప్రోగ్రామ్‌ (ESP), హిల్‌ హోల్డ్‌ అసిస్ట్‌ వంటి ఫీచర్లను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. ఏజీఎస్‌ గేర్‌బాక్స్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ మాదిరిగానే పనిచేస్తుంది. అయితే క్లచ్‌ను ఆపరేట్‌ చేయడం, గేర్లు మార్చడం వంటి పనులను సిస్టమ్‌ ఆటోమేటిక్‌గా నిర్వహిస్తుంది. దీంతో సంప్రదాయ టార్క్‌ కన్వర్టర్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ను ఉపయోగించకుండానే CNG స్విఫ్ట్‌లో ఆటోమేటిక్‌ డ్రైవింగ్‌ సౌకర్యం లభిస్తుంది.

ఇంజిన్‌, మైలేజీ

మారుతి స్విఫ్ట్‌ CNG-AMTలో 1.2 లీటర్‌, 3-సిలిండర్‌ జెడ్‌-సిరీస్‌ ఇంజిన్‌ను ఏజీఎస్‌ ఆటోమేటెడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో జత చేశారు. పెట్రోల్‌ మోడ్‌లో ఈ ఇంజిన్‌ 80 బీహెచ్‌పీ పవర్‌, 112 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. CNG మోడ్‌లో పవర్‌ 69 బీహెచ్‌పీకి, టార్క్‌ 101.8 ఎన్ఎంకు తగ్గుతుంది. ఈ కొత్త స్విఫ్ట్‌ CNG-AMT 32.85 కిలోమీటర్లు/కిలో మైలేజీ ఇస్తుందని మారుతి సుజుకి పేర్కొంది.