Green SM Limo: భారతదేశంలో సరికొత్త విప్లవాత్మక గ్రీన్ మొబిలిటీ సేవలను అందించేందుకు ‘గ్రీన్ ఎస్ఎమ్ లిమో’ (Green SM Limo) అధికారికంగా అడుగుపెట్టింది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన, డైనమిక్ మొబిలిటీ మార్కెట్ కలిగిన భారత్‌లో ప్రవేశించడం ద్వారా ఈ సంస్థ ఐదో దేశంలో తన సేవలను విస్తరించినట్లయింది. వియత్నాం, లావోస్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ తర్వాత ఈ సరికొత్త సేవలను మన దేశంలో ప్రారంభించారు. 2023లో వియత్నాంలో రూపుదిద్దుకున్న ఈ సంస్థ.. కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను (ఈవీ) మాత్రమే నడుపుతూ పర్యావరణహిత ప్రయాణాన్ని అందిస్తుంది. భారత్‌లో అడుగుపెట్టిన ఈ ‘గ్రీన్ ఎస్ఎమ్’ సంస్థ నేరుగా ఇక్కడి ప్రముఖ క్యాబ్ సర్వీసులైన ఓలా, ఉబెర్‌లతో పోటీ పడనుంది. ప్రారంభంలో దీని సేవలు ఢిల్లీ-ఎన్‌సిఆర్ పరిధిలోని ముఖ్య ప్రాంతాలలో అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత కస్టమర్ల డిమాండ్‌కు అనుగుణంగా దశలవారీగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు. ఈ రైడింగ్ కోసం విన్ ఫాస్ట్ సంస్థకు చెందిన ‘లిమో గ్రీన్’ కార్లను ఉపయోగిస్తారు.
ఇది ఇటీవల భారత్‌లో లాంచ్ అయిన ‘విన్ ఫాస్ట్ వీఎఫ్ ఎమ్పీవీ 7’ కి చెందిన ఫ్లీట్ వెర్షన్. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ 7-సీటర్ ఎస్‌యూవీ (SUV) లో విశాలమైన క్యాబిన్, స్మూత్ పర్ఫార్మెన్స్ లభిస్తాయి. పైగా ఎలాంటి కాలుష్య ఉద్గారాలు ఉండవు. ప్రయాణికుల విలాసవంతమైన అనుభవం కోసం ప్రతి వాహనంలో త్రాగునీరు, వెట్ టిష్యూలు, ఇతర అవసరమైన వస్తువులను ఉంచుతారు. భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ కారు లోపల, బయట కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. ఈ గ్రీన్ లిమో సేవలను పొందాలనుకునే వారు యాపిల్ యాప్ స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘గ్రీన్ ఎస్ఎమ్’ (Green SM) యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు, ప్రమోషనల్ ఆఫర్ కింద జూన్ 5 నుంచి జూన్ 11 వరకు యాప్ ద్వారా బుక్ చేసుకునే రైడ్స్‌పై కంపెనీ ఏకంగా 50 శాతం డిస్కౌంట్‌ను సైతం అందిస్తోంది.
