BMW R 12 G/S India Launch: ప్రముఖ లగ్జరీ వాహన తయారీ సంస్థ BMW Motorrad భారత మార్కెట్లో సరికొత్త అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. BMW R 12 G/S పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రీమియం బైక్‌ను రూ.25.40 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులోకి తెచ్చింది. ఇందులో శక్తివంతమైన 1,170cc బాక్సర్ ఇంజిన్, ఆధునిక ఎలక్ట్రానిక్ ఫీచర్లు, అధునాతన సస్పెన్షన్ సిస్టమ్ ఉన్నాయి. సాధారణ రోడ్లతో పాటు కఠినమైన ఆఫ్-రోడ్ మార్గాల్లోనూ ప్రయాణించాలనుకునే రైడర్లను దృష్టిలో పెట్టుకొని దీన్ని రూపొందించారు.
BMW R 12 G/S డిజైన్‌లో కంపెనీకి చెందిన పాత మోటార్‌సైకిల్ BMW R 80 G/S ఛాయలు కనిపిస్తాయి. ఈ మోడల్ ఉత్పత్తి 1980లో ప్రారంభమైంది. అప్పటి క్లాసిక్ అడ్వెంచర్ డిజైన్‌ను ఆధునిక టెక్నాలజీతో కలిపి కొత్త బైక్‌ను రూపొందించారు. ఇందులో ఎండ్యూరో స్టైలింగ్, లాంగ్ సస్పెన్షన్ ట్రావెల్, క్రాస్-స్పోక్ వీల్స్, కాంపాక్ట్ కాక్‌పిట్ ఫెయిరింగ్ ఉన్నాయి. ఎడమవైపు పైకి అమర్చిన రియర్ సైలెన్సర్‌తో కూడిన ఎగ్జాస్ట్ సిస్టమ్ బైక్‌కు ప్రత్యేకమైన లుక్‌ను అందిస్తుంది. మొత్తంగా క్లాసిక్ డిజైన్‌తో పాటు అడ్వెంచర్ రైడింగ్‌కు అనువుగా దీన్ని తీర్చిదిద్దారు.
BMW R 12 G/Sలో 1,170cc ఎయిర్/ఆయిల్ కూల్డ్, రెండు సిలిండర్ల బాక్సర్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ 7,000rpm వద్ద 109hp గరిష్ట పవర్‌ను, 6,500rpm వద్ద 115Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో హైడ్రాలిక్ ఆపరేటెడ్ సింగిల్ డిస్క్ డ్రై క్లచ్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉన్నాయి. అలాగే కార్డన్ షాఫ్ట్ డ్రైవ్ సిస్టమ్‌ను అందించారు.
BMW బాక్సర్ ఇంజిన్ టెక్నాలజీకి 1923లో కంపెనీ పరిచయం చేసిన R 32 మోడల్‌తో చారిత్రక సంబంధం ఉంది. అదే ఇంజిన్ వారసత్వాన్ని ఆధునిక ఇంజినీరింగ్‌తో R 12 G/Sలో కొనసాగించారు. ఈ బైక్‌ను ట్యూబులర్ స్టీల్ స్పేస్ఫ్రేమ్పై నిర్మించారు. ఇందులో మెయిన్ ఫ్రేమ్, రియర్ ఫ్రేమ్‌ను ప్రత్యేకంగా రూపొందించి బోల్ట్‌లతో అనుసంధానించారు. వెనుక భాగంలో లగేజీని బిగించేందుకు ప్రత్యేక స్టీల్ ఐలెట్లను కూడా అందించారు.
ఆఫ్-రోడ్ ప్రయాణాలను దృష్టిలో పెట్టుకొని BMW R 12 G/Sలో అధునాతన సస్పెన్షన్ సిస్టమ్‌ను అందించారు. ముందు భాగంలో 45mm పూర్తిగా అడ్జస్ట్ చేసుకునే అప్‌సైడ్ డౌన్ ఫోర్క్ ఉంది. దీని సస్పెన్షన్ ట్రావెల్ 210mm కాగా, వెనుకవైపు Paralever స్వింగింగ్ ఆర్మ్‌తో కూడిన సస్పెన్షన్‌ను అందించారు. దీని ట్రావెల్ 200mmగా ఉంది. ఈ బైక్‌లో 21 అంగుళాల ఫ్రంట్ వీల్ ఉంటుంది. అంతేకాకుండా కంపెనీ Enduro Packageను స్టాండర్డ్‌గా అందిస్తోంది. ఇందులో 18 అంగుళాల రియర్ క్రాస్-స్పోక్ వీల్, ఆఫ్-రోడ్ టైర్లు, ఎండ్యూరో ఫుట్‌రెస్టులు, ఇంజిన్ గార్డ్, 20mm హ్యాండిల్‌బార్ రైజర్లు ఉన్నాయి. ఆఫ్-రోడ్ ప్రయాణాల్లో రైడర్లు నిలబడి బైక్ నడిపేందుకు ఈ ఫుట్‌రెస్టులు, హ్యాండిల్‌బార్ రైజర్లు ఉపయోగపడతాయి. అదనంగా Enduro Pro రైడింగ్ మోడ్ కూడా లభిస్తుంది.
ఫీచర్ల విషయానికి వస్తే BMW R 12 G/Sలో Standard Comfort Package కింద అనేక అధునాతన సదుపాయాలను అందించారు.
Shift Assistant Pro
Adaptive Headlight Pro
Hill Start Control
Cruise Control
Heated Grips
LED హెడ్‌లైట్
ABS Pro
Shift Assistant Pro సహాయంతో దాదాపు అన్ని లోడ్, స్పీడ్ పరిస్థితుల్లో క్లచ్ ఉపయోగించకుండా గేర్లు మార్చుకోవచ్చు. దీని వల్ల గేర్ షిఫ్టింగ్ వేగంగా జరిగి, యాక్సిలరేషన్ సమయంలో పవర్ అంతరాయం తగ్గుతుంది. లైటింగ్ కోసం X-ఆకారపు లైట్ ఐకాన్‌తో కూడిన LED హెడ్‌లైట్‌ను అందించారు. బ్రేకింగ్ కోసం ముందు భాగంలో 310mm ట్విన్ డిస్కులు, వెనుకవైపు 265mm సింగిల్ డిస్క్ ఉన్నాయి. వీటికి రెండు పిస్టన్ల ఫ్లోటింగ్ కాలిపర్లు అమర్చారు. భద్రత కోసం BMW Motorrad Integral ABS Pro కూడా స్టాండర్డ్‌గా లభిస్తుంది.
BMW R 12 G/Sలో Rain, Road, Enduro అనే మూడు ప్రధాన రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. Enduro Packageలో భాగంగా Enduro Pro మోడ్ కూడా లభిస్తుంది. అలాగే డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ (DTC), ఇంజిన్ డ్రాగ్ టార్క్ కంట్రోల్ (MSR) వంటి సాంకేతికతలను అందించారు. ఆఫ్-రోడ్ ప్రయాణాల్లో అవసరాన్ని బట్టి DTCని స్విచ్ ఆఫ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
భారత మార్కెట్లో BMW R 12 G/S Pro వేరియంట్‌ను రూ.25.40 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేశారు. ఈ బైక్‌ను Completely Built-Up (CBU) యూనిట్‌గా విదేశాల నుంచి భారత్‌కు దిగుమతి చేస్తున్నారు. కొనుగోలుదారులకు మూడు సంవత్సరాల వారంటీ లభిస్తుంది. అదనంగా నాలుగు, ఐదో సంవత్సరాలకు ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకునే అవకాశం ఉంది. అలాగే 24 గంటలు, ఏడాదిలో 365 రోజులూ రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సదుపాయం అందిస్తున్నారు. ఇందులో బ్రేక్‌డౌన్ సపోర్ట్, టోయింగ్ వంటి సేవలు ఉంటాయి.

