తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలిలో నేర చరితుల్ని సభ్యులుగా చేర్చడంపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘోరమైన నేరాలకు పాల్పడిన కొందరు వ్యక్తులు ఇటీవల టీటీడీ పాలకమండలిలో సభ్యులుగా చేరారని అటువంటి వారిని వెంటనే తొలగించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. నేరచరిత ఉన్నవారిని ఆలయ పాలకమండలిలో సభ్యులుగా ఎలా నియమిస్తారని.. భగవంతుని సేవలో నేరచరితులు ఉండటాన్ని ఉపేక్షించేది లేదంటూ ప్రభుత్వంపై, టీటీడీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాగా టీటీడీ పాలక మండలిలో నేరచరితులు అంశంలో ఏపీ హైకోర్టు తీర్పుపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. కోర్టు తీర్పుని పరిశీలించి కోర్టు ఇచ్చిన సూచనల మేరకు టీటీడీ పాలకమండలిలో మార్పులు చేర్పులు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. టీటీడీలోని 5,518 మంది ఉద్యోగులకు వడమాల పేట సమీపంలో 300 ఎకరాలో ఇంటి స్థలాల పంపిణీకి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఇందుకు అవసరమైన 61 కోట్ల 63 లక్షల రూపాయల డీడీని కలెక్టర్‌కు వైవీ సుబ్బారెడ్డి అందించారు. ప్రైవేటు వ్యక్తులు గోశాల ఏర్పాటు, గో ఉత్పత్తుల తయారీకి ముందుకు వస్తే పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు.
