YSRCP : స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ..

  • స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్
  • దాడులు, బెదిరింపులతో నామినేషన్లకు ఆటంకాలంటూ ఆరోపణ
  • అభ్యర్థులకు పోలీసు భద్రత కల్పించాలని విజ్ఞప్తి
  • నామినేషన్ల గడువు పెంచాలని కోరిన వైసీపీ
Ysrcp

Ysrcp

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ తదితర స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగుతున్న వేళ వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ (YSRCP) సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రాష్ట్రంలో జరుగుతున్న భారీ హింస, దాడుల కారణంగా తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోతున్నారని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఒత్తిళ్లు, పోలీసుల అడ్డుగింపుల వల్ల పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేయడంలో తీవ్రమైన ఆటంకాలు ఎదురవుతున్నాయని అందులో వెల్లడించింది.

భద్రత కల్పించాలి.. నామినేషన్ల గడువు పెంచాలి

ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అత్యవసరంగా విచారించాలని వైసీపీ కోరింది. నామినేషన్లు వేయడానికి వెళ్లే తమ పార్టీ అభ్యర్థులు, నాయకులకు ఎటువంటి భయభ్రాంతులు లేకుండా తగిన పోలీసు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసింది. నామినేషన్ల దాఖలుకు ఇప్పటికే గడువు ముగుస్తున్నందున, అభ్యర్థుల సౌలభ్యం కోసం గడువును వెంటనే పొడిగించడంతో పాటు ఎంపిక చేసిన ప్రాంతాల్లో అదనపు నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరింది. నామినేషన్ల ప్రక్రియ ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా, ప్రశాంతంగా , పారదర్శకంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును అభ్యర్థించింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు సర్వోన్నత న్యాయస్థానం స్పందించి తగిన ఆదేశాలు జారీ చేస్తుందని ఆ పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.