NTV Telugu Site icon

టీడీపీవి డ‌ర్టీ పాలిటిక్స్‌.. సానుభూతి కోసం చంద్రబాబు ప్రయత్నాలు..!

Vijayasai-Reddy

Vijayasai-Reddy

టీడీపీవి డర్టీ పాలిటిక్స్.. దాడుల ఫొటోలు చూపిస్తూ సానుభూతి పొందాలని చూస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. టీడీపీ ఆఫీసుపై దాడులు ఎందుకు జ‌రిగాయో, రాష్ట్రప‌తికి చంద్రబాబు వివ‌రిస్తే మంచిదని సూచించిన ఆయన.. కుట్రలో భాగంగానే రాష్ట్రంపై పెద్ద ఎత్తున త‌ప్పుడు ప్రచారానికి దిగారని.. ప్రజాభిమానం ఉన్న సీఎంపై దుర్భాష‌లాడి ప్రజ‌లు రెచ్చిపోయేలా చేసి, రాష్ట్రంలో అల‌జ‌డి సృష్టించాల‌న్నది టీడీపీ ప్రయత్నం అని ఆరోపించారు. 2019 నుంచి వ‌రుస‌గా పార్లమెంట్‌, అసెంబ్లీ, మున్సిప‌ల్‌, పంచాయితీ ఎన్నిక‌ల్లో టీడీపీని ప్రజ‌లు పూర్తిగా తిర‌స్కరించారని.. ప్రజాస్వామ్య ప‌ద్ధతిలో అధికారం అందుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యారని.. దాంతో అప్రజాస్వామికంగా, అక్రమంగా ఆర్టిక‌ల్ 356 ఉప‌యోగించాల‌ని డిమాండ్ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు సాయిరెడ్డి.

ఇక, సీఎంపై టీడీపీ నేత బూతులు మాట్లాడారు.. ఆ పార్టీ నేతలు ఏ మాత్రం సంకోచించ‌కుండా త‌ప్పుడు మాట‌లు మాట్లాడుతున్నారని విమర్శించిన సాయిరెడ్డి… సీఎం జగన్‌పై టీడీపీ నేతల దుర్భాష‌తో ప్రజ‌లు తీవ్రంగా బాధ‌ప‌డ్డారన్నారు. రాజ్యాంగ‌ప‌ద‌విలో ఉన్న సీఎంపై చంద్రబాబు రెచ్చిపోయి మాట్లాడి దుర్బాష‌లాడేవారిని మ‌రింత ప్రోత్సహిస్తున్నారని ఆరోపించిన ఆయన.. టీడీపీ “డ‌ర్టీ పాలిటిక్స్‌”పై ప్రజ‌ల ఆగ్రహం ఫ‌లిత‌మే ఆ పార్టీ ఆఫీసుల‌పై దాడులని వ్యాఖ్యానించారు. దాడుల ఫొటోలు చూపి చంద్రబాబు సానుభూతి పొందాల‌ని చూస్తున్నారని సెటైర్లు వేసిన వైసీపీ ఎంపీ.. దాడులు ఎందుకు జ‌రిగాయ‌న్నదానిపై బాబు సైలెంట్ గా ఉన్నారని.. ప‌ట్టాభి చేసిన వ్యాఖ్యల‌ను క‌నీసం ఖండించ‌లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జ‌గ‌న్‌పై టీడీపీ నేత‌లు దుర్బాష‌లాడుతున్నారు.. త‌ప్పుడు ప్రచారం చేస్తున్నారు.. కుట్రలో భాగంగానే స‌భ్యత‌, సంస్కారం లేకుండా బూతులు మాట్లాడుతున్నారని.. సంక్షేమ ప‌థ‌కాలు ప్రజ‌ల‌కు అంద‌కుండా ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.