Site icon NTV Telugu

Vijayasai Reddy: కాంగ్రెస్‌ వల్లే నేను రాజ్యసభకు రాగలిగా.. సాయిరెడ్డి ఛలోక్తులు

కాంగ్రెస్‌ పార్టీపై రాజ్యసభ వేదికగా సెటైర్లు వేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి… 2 నెలల్లో పదవీ విరమణ చేయనున్న 72 మంది రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు పలికేందుకు ప్రత్యేకంగా సమావేశమైన రాజ్యసభలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్‌ పార్టీ మా మీద తప్పుడు కేసులు బనాయించడం వల్లనే నేను రాజ్యసభకు రాగలిగానంటూ ఛలోక్తులు విసిరారు. ఇక, తనను రాజ్యసభకు ఎంపిక చేసి పంపించినందుకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన ఆయన.. రాజ్యసభ చైర్మన్‌గా క్రమశిక్షణ, విలువలను, సభా మర్యాదను కాపాడేందుకు కృషి చేస్తున్న మీ నాయకత్వంలో ఈ సభలో సభ్యుడిగా కొనసాగడం అదృష్టంగా భావిస్తున్నట్లు వెంకయ్యనాయుడని ఉద్దేశించి వ్యాఖ్యానించారు సాయిరెడ్డి.

Read Also: AP: జగన్ రెడ్డికి పిచ్చి బాగా ముదిరింది… అయ్యన్న ఫైర్..

ఇక, చెన్నైలో చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్న తాను రాజ్యసభ సభ్యుడి స్థాయికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు విజయసాయిరెడ్డి.. సభా కార్యక్రమాలలో తనకు సలహాలు, సూచనలు ఇచ్చిన కాంగ్రెస్‌ సభ్యులు జైరాం రమేష్‌కు తన గుండెల్లో ప్రత్యేక స్థానం ఉందన్న ఆయన.. అలాగే రాజ్యసభకు ఎన్నికైన సమయంలో తనకు మార్గదర్శనం చేసిన అకాలీదళ్‌ సభ్యులు నరేష్ గుజ్రాల్‌కు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై ప్రశంసలు కురిపించారు సాయిరెడ్డి.. ఆమె పనితీరును అభినందిస్తూ తాను అనేక పర్యాయాలు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సమావేశమయ్యానని.. ప్రతి అంశాన్ని ఆమె చాలా శ్రద్ధగా ఆలకిస్తూ వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేశారని ఈ సందర్భంగా వెల్లడించారు.. టూరిజం, ట్రాన్స్‌పోర్ట్‌ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా విశేష ప్రతిభ చూపిన టీజీ వెంకటేష్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీలన్నింటిలోకి పని తీరులో ఎప్పుడూ ముందంజలో ఉండే టీజీ వెంకటేష్‌ కమిటీని అధిగమించడానికి కామర్స్‌ కమిటీ చైర్మన్‌గా తాను తాపత్రయపడుతుండే వాడినంటూ తన అనుభవాలను గుర్తుచేసుకున్నారు.

Exit mobile version