Vellampalli Srinivas: వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడలో శుక్రవారం నాడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నివాసానికి కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ వెళ్లారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాన్ని వర్ల రామయ్య నివాసంలో ఆయన డ్రైవర్‌కు అందజేశారు. వెల్లంపల్లి శ్రీనివాస్ వచ్చిన సమయంలో వర్ల రామయ్య తన నివాసంలోనే ఉన్నారు. అయితే ఆయన మాత్రం బయటకు రాలేదు. తమ ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా కింద వర్ల రామయ్య సతీమణికి రూ.13,500 సాయం అందిందని వెల్లంపల్లి లేఖ అందించే ప్రయత్నం చేశారు.
Read Also: Gadwal Road Accident: దైవదర్శనానికి వెళుతుండగా.. ఘోర ప్రమాదం
ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. టీడీపీ నేత వర్ల రామయ్య నిత్యం తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటారని.. అయినా ఆయన ఇంట్లోనూ రైతు భరోసా ఇస్తున్నామని వెల్లడించారు. వర్ల రామయ్య కూడా ప్రభుత్వ పథకాలను పొందుతున్న లబ్దిదారుడేనని పేర్కొన్నారు. అర్హత ఉంటే చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్‌కు కూడా అమ్మ ఒడి వర్తింపజేస్తామని వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. తాము ఏ పార్టీ అని చూడటం లేదని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని.. ఇదే తమ ప్రభుత్వ గొప్పతనం అని అభిప్రాయపడ్డారు. వివక్షకు తావు లేకుండా తమ ప్రభుత్వ పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు.