Site icon NTV Telugu

YSRCP : టీడీపీకి బిగ్‌ షాక్‌.. వైసీపీ గూటికి ఐదుగురు కార్పొరేటర్లు

Jagan

Jagan

YSRCP : నెల్లూరు నగర మేయర్ స్రవంతిపై ఈనెల 18న అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు టీడీపీ సిద్ధమవుతున్న నేపథ్యంలో, నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. గతంలో వైఎస్సార్‌సీపీ తరపున గెలిచి, ఆ తర్వాత టీడీపీలోకి వలస వెళ్లిన ఐదుగురు కార్పొరేటర్లు ఇప్పుడు తిరిగి వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతామని ప్రకటించడం విశేషం.

మాజీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో కలిసిన ఈ ఐదుగురు కార్పొరేటర్లు, తమ నిర్ణయాన్ని ఆయన సమక్షంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి వారితో పాటు ఉన్నారు. పార్టీలోకి తిరిగి వచ్చిన కార్పొరేటర్లలో మద్దినేని మస్తానమ్మ (6వ డివిజన్‌), ఓబుల రవిచంద్ర (5వ డివిజన్‌), కాయల సాహితి (51వ డివిజన్‌), వేనాటి శ్రీకాంత్ రెడ్డి (16వ డివిజన్‌), షేక్‌ ఫమిదా (34వ డివిజన్‌) ఉన్నారు. వీరందరికీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి స్వయంగా పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కొద్ది రోజుల ముందు జరిగిన ఈ కీలక పరిణామం వైఎస్సార్‌సీపీకి నగరపాలక సంస్థలో బలాన్ని చేకూర్చింది. టీడీపీలోకి వెళ్లిన కార్పొరేటర్లు మళ్లీ సొంత గూటికి చేరతామని ప్రకటించడంతో, మేయర్‌ను పదవి నుంచి తొలగించాలని చూస్తున్న టీడీపీ ప్రయత్నాలకు ఇది తాత్కాలికంగా అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో, ఈనెల 18న జరగబోయే అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ప్రక్రియ, నెల్లూరు రాజకీయాల్లో మరింత ఆసక్తిని పెంచింది.

CM Chandrababu : ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ

Exit mobile version