Site icon NTV Telugu

Atmakur Bypoll: ఉప పోరులో విక్రమ్ రెడ్డి ఘనవిజయం

Atmakur Vikram

Atmakur Vikram

ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆత్మకూరు ఉప ఎన్నికలో అధికార వైసీపీ ఘన విజయం సాధించింది. ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌సీపీ పార్టీ విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌ రెడ్డి.. 82,888 ఓట్ల భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. ఉప ఎన్నికలో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్‌ కుమార్‌ డిపాజిట్‌ కోల్పోయారు.బీజేపీకి కేవలం 18,216 ఓట్లు లభించాయి. పోటీలో నిలిచిన ప్రతిపక్ష నేతలను మేకపాటి విక్రమ్‌ రెడ్డి చిత్తుగా ఓడించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి 1,02,240 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌కు 19,352 ఓట్లు వచ్చాయి.

ఉప ఎన్నికలో ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్‌ నుంచి మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఆధిక్యత కొనసాగింది. రౌండ్లు ముగుస్తున్న కొద్దీ ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయారు. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌.. విక్రమ్‌ రెడ్డికి ఏ మాత్రం పోటీనివ‍్వలేదు. ఇక, పోస్టల్‌ బాలెట్‌లో 205 ఓట్లకు గానూ వైఎస్సార్‌సీపీకి 167 ఓట్లు వచ్చాయి. దీంతో, బ్యాలెట్‌ ఓట్లలోనూ వైఎస్సార్‌సీపీ భారీ ఆధిక్యం సాధించింది. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం కారణంగా ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి, బీజేపీ నుంచి భరత్‌కుమార్‌ యాదవ్‌ సహా మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేశారు. గతంతో పోలిస్తే పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది.

64.26 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం ఓట్లు 2,13,338 కాగా, పోలైన ఓట్లు 1,37,081. 2019లో 82.44 శాతం పోలింగ్ నమోదైంది. 18.18 శాతం తక్కువగా పోలింగ్ నమోదు కావడంతో వైసీపీ నేతలు వేసుకున్న లక్ష మెజారిటీ అంచనాకు చేరువ కాలేకపోయారు.

Netflix: 300 మంది ఉద్యోగులను తొలగించిన నెట్‌ఫ్లిక్స్.. కారణమేంటంటే?

Exit mobile version