Andhra Pradesh: చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం అర్ధరాత్రి పారిశ్రామిక వేత్త రామచంద్రయాదవ్ ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇంటి కిటికీ అద్దాలు, కుర్చీలు పగిలిపోగా, కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. సదుంలో రైతు భేరి నిర్వహిస్తామని చెప్పడంతోనే వైసీపీ శ్రేణులు పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ ఇంటిపై దాడికి పాల్పడినట్లు సమాచారం అందుతోంది. అంతేకాకుండా ఆయన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు.
కాగా వందలాది మంది వైసీపీ కార్యకర్తలు తమ ఇంటిపై రాళ్లు, కత్తులు, రాడ్లతో ఇంటిపై దాడిచేశారని రామచంద్రయాదవ్ ఆరోపించారు. తన ఇంటి దగ్గర వీరంగం జరుగుతున్నా ఎస్పీ, డీఐజీ, స్థానిక పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో రైతు భేరి సభను వాయిదా వేసుకుని అంబేడ్కర్ విగ్రహానికి నివాళి అర్పించి ఇంటికి చేరుకున్నానని తెలిపారు. తమ ఇంటి తలుపులు బలంగా ఉండటంతో వైసీపీ కార్యకర్తలు పగలగొట్టలేకపోయారని రామచంద్రయాదవ్ కుటుంబీకులు వివరించారు. దీంతో తమకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. కాగా గత శాసనసభ ఎన్నికల్లో పుంగనూరు జనసేన అభ్యర్థిగా రామచంద్రయాదవ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
