YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..

Ys Avinash Reddy Ed

Ys Avinash Reddy Ed

YS Viveka Murder Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 14న తమ ముందు విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించినట్లు తాజా సమాచారం. హత్య కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్‌ కోణంలో ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.

ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, షేక్ దస్తగిరిలను ఈడీ విచారించింది. దస్తగిరి అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. వీరి వాంగ్మూలాలు, బ్యాంకు లావాదేవీలు, ఇతర ఆర్థిక వివరాలను ఈడీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. వైఎస్‌ వివేకా హత్యకు సంబంధించి రూ.40 కోట్ల ఆర్థిక ఒప్పందం జరిగిందన్న ఆరోపణలు, నగదు బదిలీలకు సంబంధించిన అంశాలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. 2019 నుంచి నిందితులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, నగదు లావాదేవీలను పరిశీలిస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

ఇదిలా ఉండగా, 2026 ఆగస్టు 21న హైదరాబాద్, కడపలోని ఏడు ప్రాంతాల్లో వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో పత్రాలు, డిజిటల్ పరికరాలతో పాటు అవినాష్‌ రెడ్డికి సంబంధించిన ప్రాంగణంలో లెక్కల్లో చూపని రూ.24 లక్షల నగదు, రెండు లాకర్ తాళాలు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారికంగా వెల్లడించింది. అక్టోబర్ 14న అవినాష్‌ రెడ్డి విచారణకు హాజరైన తర్వాత ఈడీ ఏ అంశాలపై ప్రశ్నలు వేస్తుంది, దర్యాప్తు ఏ దిశగా సాగుతుంది అనేది కీలకంగా మారింది.