YS Jagan: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. పులివెందుల ప్రజలు దమ్ము, ధైర్యంతో తనకు అండగా నిలబడ్డారని అన్నారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ రెండు చేతులు జోడించి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పులివెందులలో చోటుచేసుకున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, ఎన్నికల నిర్వహణ తీరు, పోలీసుల వ్యవహారశైలి, నామినేషన్ల ప్రక్రియపై పలు ప్రశ్నలు సంధించారు.
మహాభారతంలోని కౌరవులు, శకుని పాత్రలు గుర్తుకొస్తున్నాయి
ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూస్తుంటే మహాభారతంలోని కౌరవుల సభ గుర్తుకొస్తోందని జగన్ వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరును మహాభారతంలోని శకుని పాత్రతో పోల్చారు. మాయాజూదంలో ఎలాంటి వ్యూహాలు అనుసరించారో, ప్రస్తుతం కూడా అలాంటి మాయపాచికలతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో జరిగిన పరిణామాలను చూస్తూ ఊరుకున్నట్లుగానే, ఇప్పుడు కూడా చంద్రబాబు తీరును చూస్తూ మౌనంగా ఉంటున్నారని ఆరోపించారు. ఇక, ఎన్నికల సంఘం సైతం ఈ పరిస్థితుల్లో ఏమీ చేయలేని స్థితిలో ఉందా అని జగన్ ప్రశ్నించారు. అధికారులు, పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘం, పోలీసు శాఖలోని అధికారులు తమ బాధ్యతలను గుర్తించి ఆలోచించాలని సూచించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు.
నామినేషన్ కేంద్రాల ఆక్రమణపై తీవ్ర విమర్శలు
గతంలో పోలింగ్ సమయంలో బూత్‌లను రిగ్గింగ్ చేశారనే ఆరోపణలు వినేవాళ్లమని, కానీ నామినేషన్ కేంద్రాలను ఆక్రమించి అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం దారుణమని జగన్ అన్నారు. ఇలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లోనే చోటుచేసుకుంటున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎటువైపు వెళ్తోందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు నిర్వహించే ధైర్యం లేకపోతే ఇలా దౌర్జన్యంగా ఎన్నికల ప్రక్రియను కొనసాగించడం ఎందుకని ప్రశ్నించారు. ఎన్నికల పేరుతో ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
నామినేషన్లకు వెళ్లకుండా అడ్డంకులు.. మహిళల పత్రాలు లాక్కున్నారని ఆరోపణ
నామినేషన్ కేంద్రాలకు వెళ్లే మార్గాల్లో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారని, ప్రతి 300 మీటర్లకు ఒక తనిఖీ కేంద్రం పెట్టినట్లుగా పరిస్థితి ఉందని జగన్ పేర్కొన్నారు. తన పార్టీకి చెందిన అక్కచెల్లెమ్మలు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. వారి చేతుల్లోని నామినేషన్ పత్రాలను సైతం లాక్కున్నారని విమర్శించారు. అభ్యర్థులు తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోకుండా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇక, పులివెందులలో మొత్తం 40 వార్డులు ఉండగా, కేవలం 20 వార్డులకు మాత్రమే నామినేషన్లు వేయించారని, మిగిలిన 20 వార్డులకు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని జగన్ ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా లేదా అనే సందేహం కలుగుతోందని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించాల్సిన ఎన్నికల ప్రక్రియలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఎదురవుతున్నాయని ప్రశ్నించారు.
కాల్పులు, కేసులపై జగన్ సంచలన ఆరోపణలు
పులివెందులలో ఏకే-47తో 37 రౌండ్ల కాల్పులు జరిపారని, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కాల్పులు జరిగాయని జగన్ ఆరోపించారు. ఇంతటి బలప్రయోగం ఎందుకు చేయాల్సి వచ్చిందో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పులివెందులలో 924 మందిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. పోలీసులే ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తున్నారా అన్నట్లుగా పరిస్థితి ఉందని విమర్శించారు. ఎన్నికల నిర్వహణలో అక్రమాలు, దౌర్జన్యాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తూ, ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు సజావుగా జరుగుతాయని చంద్రబాబు ఎలా చెబుతారని జగన్ ప్రశ్నించారు. ఎన్నికల్లో నిబంధనలు అందరికీ సమానంగా వర్తించాలన్నారు.
‘నా కార్యకర్తపై చేయి వేస్తే.. నాపై చేయి వేసినట్లే’
పులివెందులలో తన కార్యకర్తపై ఎవరైనా చేయి వేస్తే, తనపై చేయి వేసినట్లుగానే భావించాలని జగన్ పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తమ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపించిన ఆయన, తమ సమయం కూడా వస్తుందని, అప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో తమ రాజకీయ పోరాటం మరింత ఉధృతంగా ఉంటుందని సంకేతాలిచ్చారు. ‘జగన్ 2.0లో వేరే లెవల్ ఉంటుంది. జగన్ 1 అయితే.. కార్యకర్త 2 అని గుర్తుపెట్టుకోండి’ అంటూ కార్యకర్తల ప్రాధాన్యతను స్పష్టం చేశారు. తన తండ్రి మరణం తర్వాత తనకు అండగా నిలిచింది పులివెందుల ప్రజలేనని జగన్ భావోద్వేగంగా పేర్కొన్నారు. తనకు కన్నీళ్లు వస్తే అవి ప్రజల కోసమేనని అన్నారు. ప్రజలతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ధైర్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. కష్టకాలంలో పార్టీ శ్రేణులు ఐక్యంగా ఉండాలని సూచించారు.
నవంబర్ 1న పులివెందులలోనే ఉంటా
నవంబర్ 1వ తేదీన జరిగే పోలింగ్ రోజున తాను పులివెందులలోనే ఉంటానని జగన్ ప్రకటించారు. ఎంతమంది వస్తారో రావాలని, తాను అక్కడే ఉండి పరిస్థితులను చూస్తానని సవాల్ విసిరారు. కార్యకర్తలు, ప్రజలు ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మొత్తంగా పులివెందులలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్నాయని ఆరోపిస్తున్న పరిణామాలపై జగన్ తీవ్రంగా స్పందించారు. ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్య విలువలు, అభ్యర్థుల హక్కులు, పోలీసుల బాధ్యతలపై ప్రశ్నలు లేవనెత్తారు. అదే సమయంలో పులివెందుల ప్రజలపై తనకున్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్..

