NTV Telugu Site icon

Kadapa: కడప వైసీపీలో కలవరం..! కూటమి వైపు కార్పొరేటర్ల క్యూ..

Kadapa

Kadapa

Kadapa: వైసీపీ కంచుకోటలో పాగా వేసేందుకు కూటమి నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారట. అసంతృప్తిగా ఉన్న వైసీపీ కార్పొరేటర్లను కూటమిలోకి రావడానికి ద్వారాలు తెరిచారట. అయితే, కడప కార్పొరేషన్.. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా అప్‌గ్రేడ్‌ అయినప్పటికీ నుంచి నేటి వరకు వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉంది. 2006లో కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ అయింది. దీనికోసం కడప పట్టణానికి సమీపంలో ఉన్న పలు గ్రామాలను మెడ్జ్ చేశారు. దీంతో కమలాపురం నియోజకవర్గంలోని పలు గ్రామాలు.. కడప కార్పొరేషన్ లో విలీనం అయ్యాయి. ఆనాటి నుండి కడప ఎమ్మెల్యే తో పాటు కమలాపురం ఎమ్మెల్యేకి సంబంధించిన నేతలు కార్పొరేటర్లుగా గెలుపొందుతూ వస్తున్నారు. ప్రధానంగా కడప అసెంబ్లీ మొత్తం కార్పొరేషన్ పరిధిలోనే ఉంటుంది. కడప ఎమ్మెల్యే ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్న కార్పొరేషన్ రెజల్యూషన్ తప్పనిసరి. 2004 నుంచి ఇప్పటివరకు కడప అసెంబ్లీలో టీడీపీ అభ్యర్థులు గెలిచిన దాఖలాలు లేవు. 20 సంవత్సరాలు తర్వాత మొదటిసారిగా కడప, కమలాపురం రెండు నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Read Also: Harsha Sai: నా గురించి మీకు తెలుసు.. డబ్బు కోసమే ఇదంతా: హర్షసాయి

అంతేకాకుండా రాష్ట్రంలో కూడా టీడీపీ అధికారం చేపట్టడంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేల దృష్టి కడప కార్పొరేషన్ పై పడిందట. గత 20 సంవత్సరాలుగా వైసీపీ కంచుకోటగా ఉన్న కడప కార్పొరేషన్ పై తమ ఆధిపత్యం చెలాయించడం కోసం వైసీపీ కార్పొరేటర్లు కూటమిలోకి రావడానికి ఆ ఇద్దరు నేతలు ద్వారా తెరిచారట. కడప కార్పొరేషన్ లో 50 డివిజన్లు ఉన్నాయి. వాటిలో ఒక్క డివిజన్‌లో మాత్రమే టీడీపీ కార్పొరేటర్‌.. మిగతా 49 డివిజన్లలో వైసీపీ కార్పొరేటర్లు గెలుపొందారు. కరోనాకాలంలో ఒక్క కార్పొరేటర్ మృతి చెందారు. మేయర్ తో సహా 48 మంది కార్పొరేటర్లు వైసీపీకి చెందిన వారే. కడప ఎమ్మెల్యేగా మాధవి గెలిచిన అనంతరం రెండుసార్లు కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. తన మార్కు సాధించడం కోసం ఆమె కార్పొరేటర్ లను టీడీపీలోకి రావడం కోసం పావులు కదుపుతోందట… వైసీపీలో అసంతృప్తిగా ఉన్న కార్పొరేటర్ లను తమ వైపు తిప్పుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారట.. అందులో భాగంగా 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణ.. వైసీపీని వీడి టీడీపీలో చేరారట. మరికొంతమంది వైసీపీ కార్పొరేటర్లు కూటమిలో చేరుతున్నారంటూ ముమ్మరంగా ప్రచారం సాగుతోంది. కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి కూడా తన నియోజకవర్గం లోని ఐదు మంది కార్పొరేటర్లతో మంతనాలు జరుపుతున్నారట.. వీరు కూడా త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

Read Also: KTR: హైదరాబాద్లో భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు..

ఇదిలా ఉండగా మరో 6 మంది కార్పొరేటర్లు బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారట. టీడీపీలోకి వారికి అనుమతి లేకపోవడంతో.. బీజేపీ పంచన చేరడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారట. బీజేపీ పెద్దలు కూడా కడప అసెంబ్లీలో పార్టీని బలోపేతం చేయడానికి కార్పొరేటర్ల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. మరి కొంతమంది కార్పొరేటర్లు జనసేన నేతలతో మంతనాలు జరుపుతున్నారట. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో తాము కూటమిలో చేరితే పనులు చక్కబెట్టుకోవచ్చని వైసీపీ కార్పొరేటర్లు భావిస్తున్నారట. గత 20 సంవత్సరాలుగా వైసీపీలో ఉన్న కార్పొరేటర్లు నేడు పార్టీని వీడుతున్నవారిని అడ్డుకోవడంలో వైసీపీ అధిష్టానం విపలమైందనే విమర్శలు ఉన్నాయి.. ఏది ఏమైనా కడప కార్పొరేషన్ పై పట్టు సాధించడం కోసం ఇద్దరు ఎమ్మెల్యేలు ముమ్మురంగా ప్రయత్నం చేస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు…