Vontimitta: కపడ జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. రెండవ అయోధ్యగా పేరుగాంచింది. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నేటి నుంచి 14వ తేదీ వరకు బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ ఏడాది ఉత్సవాలు 11 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. రోజు ఉదయం 9.30 నుంచి 10.15 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శేష వాహనసేవ జరుగనున్నాయి.
Read Also: What Today: ఈరోజు ఏమున్నాయంటే..?
ఇక, బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు శ్రీ రామనవమి, ఏప్రిల్ 9న హనుమత్సేవ, ఏప్రిల్ 10న గరుడసేవ, ఏప్రిల్ 11న సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరుగనుంది. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలను స్వామివారికి సమర్పించనున్నారు. అనంతరం గజ వాహన సేవ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 12వ తేదీన రథోత్సవం నిర్వహిస్తారు. ఏప్రిల్ 14వ తేదీన ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. అలాగే, ఏప్రిల్ 15న సాయంత్రం 5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.