వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. కొత్త జిల్లాలపై ఆమె తెలంగాణ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను కొందరు ఏపీ సీఎం జగన్‌కు అన్వయిస్తున్నారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆమెను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఏపీ గురించి తనను అడగొద్దంటూ తెలంగాణలోని కొత్త జిల్లాల గురించి మాట్లాడారు. ఇక్కడ 33 జిల్లాలు ఏర్పాటు చేసి ఏం సాధించారని షర్మిల ప్రశ్నించారు. కనీసం 33 జిల్లాలకు కావాల్సిన సిబ్బందినైనా డిప్లాయ్ చేసుకోగలిగారా? అని నిలదీశారు. ఏదో న్యూస్‌లో ఉండాలని మాట్లాడాతారని.. ఎందుకు చేస్తారు, ఎందుకు మాట్లాడతారో తనకు అర్థం కావడం లేదని మండిపడ్డారు.
Read Also: రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది: రేవంత్ రెడ్డి
ఈరోజు తెలంగాణలో 500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. దానిని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు డ్రగ్స్ అంశం తెరపైకి తెచ్చారని.. డ్రగ్స్ మీద టాస్క్‌ఫోర్స్ కమిటీ అంటూ ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని షర్మిల మండిపడ్డారు. ఒక ఇష్యూను డైవర్టు చేయటానికి మరో ఇష్యూ తీసుకొస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ సమస్య ఇప్పటికిప్పుడు రాత్రికి రాత్రి వచ్చినా సమస్యా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డ్రగ్స్‌ను, మద్యాన్ని పెట్టి పోషిస్తోంది కేసీఆర్ కాదా అని నిలదీశారు. డ్రగ్స్ అరికట్టాలనుకుంటే 8 ఏళ్ల నుంచి కేసీఆర్ ఏం చేశారన్నారు. ఇప్పుడు టాస్క్‌ఫోర్స్ పేరుతో కొత్త నాటకాలకు తెరతీశారన్నారు.
