YS Jagan : రాప్తాడు పాఠశాల దాడి బాధితురాలిని పరామర్శించిన వైఎస్ జగన్

  • రాప్తాడు బాలికను పరామర్శించిన వైఎస్ జగన్
  • బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో ఆరా
  • బాధిత కుటుంబానికి రూ.50 లక్షల సాయం ఇవ్వాలని డిమాండ్
  • రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ విమర్శలు
Jagan

Jagan

అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిపై జరిగిన భయంకరమైన రంపం దాడి ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న సదరు పదో తరగతి బాలికను ఆయన సోమవారం స్వయంగా పరామర్శించారు. ఆస్పత్రి వైద్యులతో సమీక్షించి బాలిక ఆరోగ్య పరిస్థితి, వైద్య సేవల వివరాలను తెలుసుకున్న ఆయన, బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగిపోయిన గంజాయి, మద్యం సంస్కృతే ఈ ఉన్మాద దాడికి ప్రధాన కారణమని, పాలనపై పట్టు సాధించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా జగన్ ధ్వజమెత్తారు.

బడిలోనూ రక్షణ లేని పరిస్థితి.. ప్రభుత్వం తలదించుకోవాలి

పాఠశాల ఆవరణలోకి ఒక అపరిచిత వ్యక్తి రంపంతో వచ్చి విచక్షణారహితంగా దాడి చేస్తుంటే అడ్డుకునే నాథుడే కరువయ్యారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో గంజాయి, బెల్టు షాపులు అందుబాటులోకి రావడంతోనే చిన్నపిల్లలు, యువత దారితప్పుతున్నారని విమర్శించారు. పాఠశాలల్లో చదువుకునే ఆడపిల్లలకు కూడా రక్షణ కల్పించలేకపోతున్న ప్రభుత్వం ఈ దారుణానికి తలదించుకోవాలని మండిపడ్డారు.

రూ.50 లక్షల సాయం చేయాలి.. కూటమి వైఫల్యాలపై జగన్ నిప్పులు

బాధిత విద్యార్థిని కుటుంబానికి కూటమి ప్రభుత్వం తక్షణమే రూ.50 లక్షల ఆర్థిక సాయం అందించాలని, వైద్య ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరించాలని జగన్ డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోకపోతే తమ పార్టీయే బాధితురాలి వైద్యానికి తోడ్పడుతుందని, భవిష్యత్తులో తమ ప్రభుత్వం రాగానే ఆ కుటుంబానికి రూ.50 లక్షలు అందిస్తుందని స్పష్టం చేశారు. బాధిత కుటుంబం వైఎస్సార్‌సీపీతో ముడిపడి ఉన్నందున, రాష్ట్రంలో నడుస్తున్న ‘రెడ్ బుక్’ కక్షసాధింపు రాజ్యాంగం వల్లే శాంతిభద్రతలు క్షీణించాయని, రాప్తాడులోనే గత 15-16 నెలల కాలంలో ఇది తొమ్మిదో ఘటన అని ఆరోపించారు. వైద్యుల శ్రమతో బాలిక కోలుకుంటోందనే వార్త కొంత ఊరటనిస్తోందని చెప్పారు.