గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో.. వైసీపీ ఎంపీటీసీ తాడబోయిన పద్మావతి సడెన్‌గా అదృశ్యమవ్వడం పెను సంచలనానికి దారి తీసింది. ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డితో కలిసి ఇంటి నుంచి వెళ్ళిన ఆమె, తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. దీంతో, ఆమె కుమారుడు యోగేంద్రనాథ్ తన తల్లిని కిడ్నాప్ చేశారంటూ ఆరోపణలు చేశారు. ఎంపీపీ ఎన్నికల సందర్భంగా తన తల్లిని ఇంటి నుంచి ఎమ్మెల్యే బలవంతంగా తీసుకువెళ్ళారని, తన తల్లి ఎక్కడున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
తన తల్లిని ఎమ్మెల్యే కిడ్నాప్ చేశారని ఎస్ఈసీ, డీజీపీకి ఫిర్యాదు చేసినా.. కనీస స్పందన కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు తన తల్లిని దాచిపెట్టారని ప్రశ్నించిన యోగేంద్రనాథ్, ఆమె గుండె సంబంధిత సమస్యతో బాధపడుతోందని, ఆమె ఆరోగ్యం పట్ల ఆందోళనగా ఉందని చెప్పారు. ఈ కిడ్నాప్‌పై హైకోర్టుని ఆశ్రయిస్తామని, హౌస్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేస్తామన్నారు. ఓవైపు వాతావరణం వేడెక్కుతుండగా, మరోవైపు తననెవరూ కిడ్నాప్ చేయలేదని పద్మావతి అనూహ్యంగా ఓ వీడియో విడుదల చేశారు. దీంతో, ఈ వ్యవహారం ఊహించని మలుపు తిరిగినట్టయ్యింది.
తనని ఎవరూ అపహరించలేదని, తాను మిగతా వైసీపీ సభ్యులతో పాటు క్యాంపులో ఉన్నానని అన్నారు. దుగ్గిరాల ఎంపీపీగా పార్టీ నిర్ణయించిన రూపవాణికి తాను మద్దతిస్తున్నానని, పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. తెనాలిలోని క్యాంపు నుంచే ఈ వీడియో విడుదలైనట్టు తెలుస్తోంది. అయితే, ఎంపీపీ ఎన్నిక పూర్తైన తర్వాత కూడా ఆమె ఇంకా ఇంటికి చేరకపోవడం గమనార్హం.