VijayaSaiReddy: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు కాక రేపుతున్నాయి. కొత్త అధ్యక్షుడు ఎవరో ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అయితే అధ్యక్ష పదవి రేసులో తాను లేనని ఇప్పటికే రాహుల్ గాంధీ పార్టీ వర్గాలకు సంకేతాలు పంపారు. అటు సోనియా గాంధీ ఆరోగ్యం దృష్ట్యా ఆమె కూడా అధ్యక్ష పదవి రేసులో లేరని తెలుస్తోంది. దీంతో ఈసారి గాంధీయేతర కుటుంబం నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్నిక అవుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో విమర్శలు సంధించారు. రాహుల్ గాంధీకి పార్టీ నడిపేంత పరిణితి లేదని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Read Also:Team India: రోహిత్ శర్మ ఖాతాలో మరో అరుదైన రికార్డు
రాహుల్ గాంధీ పార్టీని నడపడానికి అవసరమైన బుద్ధి, జ్ఞానం సంపాదించుకుని వచ్చేంత వరకు కుర్చీని అంటిపెట్టుకుని ఉండే వ్యక్తి కోసం అన్వేషించడమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల వెనక ఉన్న ముఖ్య ఉద్దేశమని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఏ పార్టీకి కూడా రెండు శక్తి కేంద్రాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. దివంగత నేత, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరును తెలుగు ప్రజలు మరిచిపోలేరని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. కాగా రాహుల్ గాంధీపై వైసీపీ ఎంపీ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే విజయసాయిరెడ్డి వైసీపీ గురించి ఆలోచిస్తే మంచిది అని.. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడటం ఎందుకు అని పలువురు నెటిజన్‌లు ఆరోపిస్తున్నారు.