విజయవాడ పర్యటనలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఏపీ సీఎం జగన్‌ను మెచ్చుకోవడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సాధారణంగా మితభాషి అని.. ఆయనకు పొగడ్తలు అంటే గిట్టవు అని.. అందుకే ఆయన ఎవరినీ ప్రశంసించిన దాఖలాలు ఉండవని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అలాంటి నితిన్ గడ్కరీ జగన్‌ను మెచ్చుకోవడం మాములు విషయం కాదన్నారు. ఏదైనా సాధించగల గట్టి ఆశయాలు ఉన్న డైనమిక్ లీడర్ జగన్ అని నితిన్ గడ్కరీ మెచ్చుకోవడం 5 కోట్ల మంది ఆంధ్రులకు దక్కిన గౌరవమని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి 20 ఆర్‌వోబీలు ఇవ్వాలని జగన్ అడిగితే.. 30 ఆర్‌వోబీలు ఇస్తామని గడ్కరీ చెప్పడం మాములు విషయం కాదన్నారు.
మరోవైపు సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ మన ఎంపీలపై చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. సగానికి పైగా భారత పార్లమెంట్ సభ్యులు క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్నారంటూ సింగపూర్ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం సరైన చర్య తీసుకుంటుందని భావిస్తున్నట్లు విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.
