Site icon NTV Telugu

AP Assembly: చంద్రబాబు రాలేదు కదా? ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకొచ్చారు..?

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమైంది… ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చర్చనుప్రారంభించారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలో కూడా ఆర్థిక ప్రగతి బాగానే ఉందన్నారు.. కరోనా సమయంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు కూడా అందించామని.. పేదరికాన్ని తగ్గించాలంటే విద్యతోనే సాధ్యం.. అందుకే విద్యకే అధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క పథకం కూడా లేదంటే ఆయన పరిపాలనేంటో అర్థమవుతోందని ఎద్దేవా చేసిన ఆయన.. కుప్పం ఫలితం చర్చకు రాకుండా ఉండేందుకు నాడు సభలో చంద్రబాబు ఏదో డ్రామా ఆడారని.. చంద్రబాబు 20 నిమిషాలు ఏడ్చినా.. ఓదర్చడానికి ఎవ్వరూ ముందుకు రాలేదంటే.. డ్రామా కాక మరేంటీ? అని ప్రశ్నించారు శ్రీకాంత్‌రెడ్డి.

Read Also: Arvind Kejriwal: మార్పు మొదలు పెట్టాం.. పంజాబ్ ప్రజలు మ్యాజిక్ చేశారు..

ఇక, గవర్నర్ ప్రసంగం సందర్భంగా టీడీపీ సభలో విపరీతమైన గందరగోళం సృష్టించిందని మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. పోడియం వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారని.. ప్రతిపక్ష సభ్యులకు.. పోడియానికి మధ్య మార్షల్స్ దడికట్టుకుని నిల్చోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.. ప్రతిపక్షానికి ఓ దశ దిశ ఉందా..? అంటూ ప్రశ్నించిన ఆయన.. ప్రతిపక్షానికి బుర్ర పోయింది.. ఎందుకు పోయిందో నాకు తెలీదని సెటైర్లు వేశారు. టీడీపీకి 160 సీట్లు కాదు.. ఆరు సీట్లు కూడా రావని జోస్యం చెప్పిన అంబటి రాంబాబు… జగన్‌ ఓడించడం ప్రతిపక్షానికి సాధ్యం కాదన్నారు.. ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ అని ప్రకటనలు చేశారు.. వాళ్ల నాయకుడు రాలేదు కదా..? ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకొచ్చారు..? చంద్రబాబుకు బాధేస్తే.. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఎందుకు బాధ కలగలేదు..? అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏడుపు బూటకమని ఆ పార్టీ ఎమ్మెల్యేలకే తెలుసు.. అందుకే టీడీపీ ఎమ్మెల్యేలు సభకు వచ్చారని వ్యాఖ్యానించిన అంబటి.. నాడు జగన్ సభను బాయ్ కాట్ చేసి వెళ్లిన తర్వాత.. జగన్ సైనికులం మేం రాలేదని గుర్తుచేసుకున్నారు అంబటి రాంబాబు.

Exit mobile version