Site icon NTV Telugu

సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ కావడం మంచి పరిణామం: ఎమ్మెల్యే రోజా

కడప జిల్లాలోని శెట్టిపాలెంలో బంధువులతో సంక్రాంతి జరుపుకునేందుకు చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం జగన్‌తో నటుడు చిరంజీవి భేటీ కావడం మంచి పరిణామమని ఎమ్మెల్యే రోజా అన్నారు. జగన్ ఏది చేసినా ప్రతిపక్షాలు బురదజల్లడం సరికాదని రోజా అభిప్రాయపడ్డారు. సామాన్య ప్రజల కోసం స్కూళ్లు, కాలేజీల ఫీజులను ప్రభుత్వం తగ్గిస్తే యాజమాన్యాలపై కక్ష సాధింపు చర్య అని ఆరోపించారని… కరోనా సమయంలో ప్రజలను విపరీతంగా దోచుకుంటున్న కార్పొరేట్ ఆస్పత్రులను కంట్రోల్ చేసినప్పుడు కూడా ప్రతిపక్షాలు విమర్శించాయని రోజా మండిపడ్డారు.

Read Also: భోగి మంటల్లో ఏపీ జీవోలు వేసిన టీడీపీ శ్రేణులు

రాష్ట్ర ప్రజలు సంతోషంగా జీవించాలన్నదే సీఎం జగన్ అభిమతమని.. దాని కోసం ఆయన ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారని ఎమ్మెల్యే రోజా వివరించారు. ఎవరైనా సీఎంను కలిసి సమస్యలు వివరించాలి కానీ రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరించకూడదని ఆమె హితవు పలికారు. చిత్ర పరిశ్రమ వాళ్లు చెప్పింది న్యాయం అనిపిస్తే.. తప్పకుండా మంచి జరుగుతుందని రోజా అభిప్రాయపడ్డారు. సీఎం జగన్‌కు ఉన్న బిజీ షెడ్యూల్‌లో చిత్ర పరిశ్రమ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని రోజా వ్యాఖ్యానించారు.

Exit mobile version