Site icon NTV Telugu

Yanamala Ramakrishnudu : బీసీలపై కక్ష సాధింపులో భాగమే కూల్చివేతలు.

Yanamala raamakrishnudu

Yanamala raamakrishnudu

టీడీపీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి వద్ద ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. పంట కాల్వ ఆక్రమించి గోడ కట్టారని అయ్యన్న ఇంటి వెనుకాల గోడను అధికారులు కూల్చివేశారు. అయితే ఈ ఘటనపై టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలపై కక్ష సాధింపులో భాగమే కూల్చివేతలని, బీసీలు గళమెత్తకుండా చేసేందుకు జేసీబీలతో వెళ్తున్నారన్నారు. రాష్ట్రంలోని బీసీలను అణచి వేయడమే ధ్యేయంగా జగన్ పని చేస్తున్నారని, మినీ మహానాడులో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించి గళమెత్తినందుకు ఇంటి గోడలు కూల్చడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.

అక్రమ కట్టడం అంటూ పోలీసులు, ఇతర అధికారులు చెప్పడం సిగ్గుచేటని, అక్రమ కట్టడం అయితే నోటీసులు ఇవ్వకుండా.. గోడ కూల్చేసిన తర్వాత ముసుగు వేసుకుని ఒక వ్యక్తిని పంపించి ఇంటి లోపల నోటీసు పత్రాలను విసిరి వెళ్లారని ఆయన ఆరోపించారు. ఇలాంటి దిక్కుమాలిన ఆలోచన తాడేపల్లిలోని తుగ్లక్ కు మాత్రమే వస్తాయని మరోసారి నిరూపితమైందన్నారు. అక్రమ కట్టడమైతే.. తెల్లవారు జామున 4 గంటలకు ఆర్డీవో, ఎస్పీ సహా వందలాది మందితో రావాల్సిన అవసరం ఏమిటి.? అని ఆయన ప్రశ్నించారు. జగన్ పాలనలో మగ్గిపోతున్న ఆంధ్రప్రదేశ్ కు స్వాతంత్ర్యం కోసం మరో స్వాతంత్ర ఉద్యమం చేసే పరిస్థితులు నెలకొన్నాయని, ఈ తుగ్లక్ ప్రభుత్వంపై పోరాడుతాం.. బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు.

Exit mobile version