NTV Telugu Site icon

Yanamala: అప్పులపై బహిరంగ చర్చకు సీఎం జగన్ సిద్ధమా?

Yanamala

Yanamala

Yanamala: వైసీపీ ప్రభుత్వ పాలనపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. అప్పులపై అరగంటకో అబద్ధం.. గంటకో అప్పు, రోజుకో నిబంధన.. ఉల్లంఘన అనే విధంగా వైసీపీ పాలన సాగుతోందని యనమల ఆరోపించారు. అప్పులపై సీఎం జగన్ బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కాగ్ అధికారుల సమక్షంలో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నట్లు యనమల తెలిపారు. రాజ్యంగబద్ధ సంస్థలైన కాగ్ వంటి వాటికి కూడా వాస్తవాలు ఇవ్వకుండా దాచిపెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం లెక్కలు, నివేదికలు ఇవ్వడం లేదని కాగ్ చెప్పిన విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు.

Read Also: Maa Bava Manobhavalu: బాలయ్య పాటకి ఇరగదీసే స్టెప్పులు వేసిన చరణ్, బన్నీ

గతంలో కన్నా తక్కువ అప్పులు చేస్తున్నామంటూ సీఎం జగన్ మరోసారి అబద్ధ ప్రచారానికి తెర లేపారని యనమల విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలో రూ.6 లక్షల 38 వేల కోట్లు అప్పు చేసిందని.. అప్పులు 3.98 లక్షల కోట్లు, హఫ్ బడ్డెట్ బారోయింగ్ 93 వేల కోట్లు, కార్పొరేషన్ గ్యారెంటీలు 1.47 లక్షల కోట్లుగా ఉందన్నారు. వీటికి అదనంగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన వేతనాలు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు వేల కోట్లల్లో ఉంటాయన్నారు. జగన్ ఐదేళ్ల పదవీ కాలం పూర్తయ్యేనాటికి అప్పు రూ.11 లక్షల కోట్లకు పైగా చేరుతుందని యనమల జోస్యం చెప్పారు. కార్పొరేషన్లు, వివిధ సంస్థల ద్వారా తీసుకొస్తున్న అప్పుల లెక్కలను చూపకుండా దాచిపెడుతున్నారని ఆరోపించారు. కార్పొరేషన్ల బ్యాలెన్స్ షీట్లను పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని.. వైసీపీ ప్రభుత్వ హయాంలో లంచాలు తగ్గాయనడం హాస్యాస్పదంగా ఉందని చురకలు అంటించారు.

ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఇకమీదట అవినీతి, అక్రమాలకు పాల్పడొద్దని ముఖ్యమంత్రి చెప్పిన మాట వాస్తవం కాదా అని యనమల సూటిగా ప్రశ్నించారు. ప్రజల సంక్షేమం కోసం వినియోగించాల్సిన ప్రకృతి సహజ వనరులను వైసీపీ నేతలు దోపిడీ కోసం వినియోగించుకోవడం లేదా అని నిలదీశారు. మద్యం, ఇసుక వ్యవహారాల్లో నగదు లావాదేవీలను మాత్రమే ఎందుకు నిర్వహిస్తున్నారని సూటి ప్రశ్న వేశారు. తాడేపల్లి ప్యాలెస్ ముడుపుల కోసం రాష్ట్రంలో డిజిటల్ లావాదేవీలు లేకుండా చేసిన విషయం వాస్తవం కాదా అని అన్నారు. 175 సీట్లు వస్తాయనేది అన్నీ పగటి కలలే అని ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కు పడిపోవడం ఖాయమన్నారు. సాగునీటి ప్రాజెక్టులు అన్నిపూర్తిచేసి సస్యశ్యామలం చేస్తామని జల కధలు చెప్పిన జగన్ మూడున్నరేళ్లుగా ఎన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశారని నిలదీశారు. వ్యవసాయం.. గాలిలో దీపమై పనుల్లేక ప్రజలు వలస పోతున్నారని.. జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చేసిన ద్రోహం, దగా, మోసం ఏ రాష్ట్రంలో ఎప్పుడూ ఎక్కడా ఏ పాలకుడూ చేసి ఉండరని యనమల అభిప్రాయపడ్డారు.