Site icon NTV Telugu

Yanamala: జగన్ ఈ శతాబ్దంలోనే అతిపెద్ద జోక్ చెప్పారు

Yanamala On Ys Jagan

Yanamala On Ys Jagan

అవినీతి నిర్మూలనపై సీఎం జగన్ ‘ఏపీబీ 144000’ యాప్‌ను లాంచ్ చేయడం మీద టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు కౌంటర్లు వేశారు. మొత్తం వ్యవస్థల్నే దోచేసిన వ్యక్తి.. లంచాలు తీసుకోవడం నేరమని జగన్ మాట్లాడటం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్ అంటూ ఛలోక్తులు పేల్చారు. జగన్ సామాజిక న్యాయం కేవలం మాటలకే పరిమితమైందే తప్పే, ఆచరణలో శూన్యమన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్ దోచుకున్నారని, ఇప్పుడు తాను అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని నిలువునా దోచేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను దోచుకున్న డబ్బంతా ఎక్కడ దాచారో జగన్ చెప్పాలని యనమల డిమాండ్ చేశారు.

క్విడ్ ప్రోకో కేసుల్లో 14 ఛార్జ్ షీట్లలో ముద్దాయిగా ఉన్న జగన్.. లంచాల గురించి మాట్లాడటం నిజంగా విడ్డూరంగా ఉందని యనమల ఎద్దేవా చేశారు. అధికారులు లంచాలు తీసుకోవడం తప్పైతే.. జగన్ క్విడ్ ప్రోకోతో దోచుకోవడం నేరం కాదా? అని ప్రశ్నించారు. మూడేళ్ళ పాలనలో జగన్ ఏ ఒక్క సామాజిక వర్గానికి న్యాయం చేయలేదని దుయ్యబట్టారు. జగన్ పాలనలో విద్యారంగం పతనావస్థకు చేరుకుందని, బలహీన వర్గాలకు విద్యనందిచడంలో వైపీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. అమ్మఒడి సరిగా ఇవ్వకపోవడం వల్ల.. కాలేజీల్లో విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వడం లేదన్నారు. జగన్, వైసీపీ నాయకుల ఆదాయలు అంతకంతకు పెరుగుతున్నాయి కానీ, ప్రజల ఆదాయాలు పూర్తిగా పడిపోయాయని చెప్పిన యనమల.. సామాజిక న్యాయం అంటే ఇదేనా? అని నిలదీశారు.

యువతకు ఉద్యోగాలు లేవని.. దీనికంతటికీ జగన్ అసమర్థత, చేతకానితనమే కారణమని యనమల అన్నారు. యువతకు ఉద్యోగాలు లేనప్పుడు ఉపాధి ఏ విధంగా లభిస్తుందని అడిగారు. ఉపాధి హామీ పని దినాలను సైతం 25 శాతం తగ్గించేశారన్నారు. మహానాడుకు పోటీగా బస్సుయాత్ర చేయాలనుకున్నారని.. కానీ ఆ యాత్రతో ప్రజల నమ్మకాన్ని జగన్ పోగొట్టుకున్నారని చెప్పారు. ప్రజల్ని మోసం చేసి ఓట్లు సంపాదించుకున్న జగన్.. వచ్చే ఎన్నికల్లో కచ్ఛితంగా ఓటమి చవిచూస్తారని యనమల రామకృష్ణ ముక్తకంఠంతో చెప్పారు.

Exit mobile version