ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ హాట్ టాపిక్‌గా మారిన నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ స్పందించారు. ఆ ప్రాజెక్ట్‌ను ప్రతిఒక్కరూ ఏటీఎంలానే చూశారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఇరిగేషన్ మంత్రులు వస్తున్నారు, పోతున్నారే తప్ప.. ఫోలవరంపై ఫోకస్ పెట్టడం లేదని ఆరోపించారు. పోలవరం మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు కానీ, ఏమీ తేల్చడం లేదని దుయ్యబట్టారు. పని పూర్తి చేస్తే కేంద్రం నిధులిస్తుందని, కానీ ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నాయని ఆగ్రహించారు.
ఏపీలో చెత్త తొలగించాలన్నా.. చిన్న చిన్న రిపేర్లు చేయాలన్నా కేంద్రం ఇస్తోన్న నిధులే దిక్కయ్యాయని సత్య కుమార్ చెప్పారు. దేశంలో గత 8 ఏళ్లలో మునుపెన్నడూ జరగని విశేష అభివృద్ధి జరిగిందన్నారు. పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధుల్ని రాష్ట్రం మింగేస్తోందని విమర్శించారు. ఏపీలో కూల్చివేతలతో మొదలైన పరిపాలన ఇంకా కొనసాగుతూనే ఉందని అభిప్రాయపడ్డారు. ఇసుక నుంచి తైలం తీయొచ్చన్న సత్య కుమార్.. ఇసుకని సైతం అధికార పార్టీ ఆదాయ మార్గంగా మలుచుకుందని మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా ఏం సాధించారని ప్రశ్నించిన ఆయన.. మూడు రాజధానులని చెప్పి, రాష్ట్రానికి రాజధానే లేకుండా చేశారని ఆగ్రహించారు.
ఇదే సమయంలో.. ఏయూలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చిన విషయంపై సత్య కుమార్ స్పందించారు. అసాంఘీక కార్యక్రమాలను బూచిగా చూపి.. భూముల్ని దోచుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణలు చేశారు. ఏయూ భూములను వేరే వారికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అలా జరగనివ్వమని సత్య కుమార్ వెల్లడించారు.
