Andhra Pradesh: ఏపీ పాఠశాల విద్యావ్యవస్థలో కీలక అడుగు పడింది. విద్యాశాఖలో తొలిసారిగా ప్రపంచ బ్యాంకు భాగస్వామ్యం అవుతోంది. ఈ మేరకు వివరాలను పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ వెల్లడించారు. రాష్ట్రంలో నాడు-నేడు పనులను ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టు కిందే చేస్తున్నామని ఆయన తెలిపారు. 2012లో సాల్ట్ ప్రాజెక్టు కింద ప్రపంచ బ్యాంకు 250 మిలియన్ డాలర్ల ఆర్ధిక సాయం అందిస్తోందన్నారు. ఈ రుణం కోసం ప్రపంచ బ్యాంకు ఎలాంటి షరతులను విధించలేదని స్పష్టం చేశారు. పాఠశాల విద్యాశాఖలో ఈఏపీ ప్రాజెక్టు కింద చేపడుతున్న తొలి ప్రాజెక్టు ఇదేనని పేర్కొన్నారు. పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ లాంటి షరతులను ప్రపంచ బ్యాంకు పెట్టిందని ప్రచారం చేయడం అవాస్తమన్నారు.
గడచిన మూడేళ్లలో పాఠశాల విద్యాశాఖలో రూ. 53 వేల కోట్లకు పైగా వ్యయం చేశామని పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ తెలిపారు. అమ్మ ఒడి పథకానికి 19,617 కోట్లు, నాడు నేడు తొలిదశకు 3 వేల కోట్లకు పైగా వ్యయం అయ్యిందని చెప్పారు. పాఠశాల విద్య లాంటి సామాజిక రంగంలో ఒక్క రోజులోనే ఫలితాలు రావని గుర్తించాలన్నారు. 2022-23 విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య 40,31,239 గా నమోదైందన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 86,119 మంది విద్యార్ధులు మాత్రమే తగ్గారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఆంగ్ల మాధ్యమంలో బోధనతో విద్యార్ధుల సంఖ్య తగ్గటం లేదని.. ఆంగ్లాన్ని నేర్పే అంశంపై త్వరలోనే అన్ని పాఠశాలలకూ ఓఎస్ఓపీ జారీ చేస్తామని చెప్పారు. నవంబరు నెలాఖరు నాటికి 8 తరగతి చదువుతున్న 4.6 లక్షల మంది విద్యార్ధులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తామన్నారు. 2025 నాటికి వీరంతా సీబీఎస్ఈ విధానంలో పరీక్షలు రాస్తారని బి.రాజశేఖర్ అన్నారు.