సమాజంలో అడుగడుగునా మోసాలు జరుగుతున్నాయి. భర్త బతికుండగానే మరణించినట్లు వార్డు సచివాలయ సిబ్బంది, రెవిన్యూ అధికారులతో కలిసి ఓ మహిళా వాలంటీర్ మోసానికి తెగబడింది. ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్ కార్డులో నుండి తన భర్త పేరున తొలగించిన సంఘటన అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన బళ్లారి సుభాహాన్ బాషా గత రెండు ఏళ్ల కిత్రం రాయచోటి పట్టణం కొత్తపల్లెకు చెందిన ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. ఇటీవల మనస్పర్ధలతో భార్యాభర్తలు గత కొన్ని రోజులుగా వేర్వేరుగా ఉంటున్నారు. ప్రధాన మంత్రి సమ్మాన్ నిధి కింద ఆర్థిక సాయం పొందడానికి చక్రాయపేటలోని గ్రామ సచివాలయం సిబ్బందిని కలిశారు. రేషన్ కార్డులో పేరు తొలగించిన కారణంగా పథకం వర్తించే అవకాశం లేదని సిబ్బంది సమాధానమిచ్చారు.
కార్డులో పేరు తొలగింపు విషయం పరిశీలించగా మరణించినట్లు నమోదైందని తెలుసుకుని రాయచోటికి వెళ్లి అక్కడ తహసీల్దారును కలిశారు. కొత్తపల్లి-3 గ్రామ సచివాలయానికి చెందిన వీఆర్వో యోగాంజనేయులు రెడ్డి లాగిన్ ద్వారా ఆన్లైన్ లో మరణించినట్లు నమోదైనట్లు గుర్తించి తనకు జరిగిన అన్యాయం పై చర్యలు తీసుకోవాలని బాధితుడు అన్నమయ్య జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. తాను చనిపోలేదని బతికే ఉన్నానని తాను చనిపోయినట్లు ఎందుకు ఆన్లైన్ లో నమోదు చేశారని వీఆర్ఓ ను ప్రశ్నించగా తన పై వీఆర్ఓ బెదిరింపులకు పాల్పడి దుర్భాషలాడరని బాధితుడు సుభాహాన్ బాషా వాపోయాడు. తనకు ఎదురైన సంఘటన ఏ భర్తకు కూడా జరగకూడదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న అధికారుల పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
