పార్టీ ఏదైనా.. నియోజకవర్గం ఏదైనా.. గెలుపుపై గ్యారంటీ ఉన్న రాజకీయ నేత ఎవరైనా ఉన్నారా అంటే అది గంటా శ్రీనివాసరావు మాత్రమే. ఎన్నికల్లో ఆయన ఏ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసినా.. ఏ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసినా గెలుపు సొంతం చేసుకుంటారు. వైసీపీ ప్రభంజనం సృష్టించిన 2019 ఎన్నికల్లోనూ టీడీపీ తరఫున విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల తర్వాత గంటా సైలెంట్ అయ్యారు. పార్టీ మారాలని ప్రయత్నాలు చేసినా వర్కవుట్ కాలేదు. చివరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా స్పీకర్ ఆమోదించలేదు.
అప్పటి నుంచి గంటా శ్రీనివాసరావు టీడీపీలో కొనసాగుతున్నా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు తనపై, తన భార్య పైనా వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని కన్నీరు పెట్టిన సందర్భంలో పార్టీకి సంబంధం లేని వారు సైతం స్పందించారు. కానీ గంటా మాత్రం ఎక్కడా తన వాయిస్ వినిపించలేదు. దీంతో ఆయన వచ్చే ఎన్నికల్లో పార్టీ మారతారన్న ఊహాగానాలు కూడా వచ్చాయి. కొత్త పార్టీ పెడతారనే ప్రచారం కూడా జరిగింది. తాజాగా ఆ ప్రచారానికి బ్రేక్ పడింది. ఉన్నట్టుండి టీడీపీ అధినేత చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు. ఏపీ మళ్లీ బాగుపడాలంటే చంద్రబాబు సీఎం కావాలని గంటా ఆకాంక్షించారు.
Ganta Srinivasa Rao: ఏపీ బాగుండాలంటే చంద్రబాబు మళ్లీ సీఎం కావాలి
అయితే గంటాలో సడెన్ మార్పుకు కారణం ఇటీవల చంద్రబాబు చేసిన ప్రకటనే కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పార్టీ కోసం పనిచేసే వారికి మాత్రమే టికెట్లు ఇస్తామని.. పార్టీకి కష్టకాలంలో అండదండలు అందించిన వారికే ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు ప్రకటించడంతో గంటా శ్రీనివాసరావు మేల్కొన్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం వైసీపీ గేట్లు మూసుకుపోవడంతో బీజేపీ, జనసేన లాంటి పార్టీల్లో చేరటం కంటే.. టీడీపీలోనే కొనసాగి తన ప్రాధాన్యం పెంచుకోవడం బెటరని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.