Janasena vs Janasena: నేను 2 ఎకరాలు ఇస్తా.. 3 ఎకరాలైనా నేను సిద్ధం.. సర్పంచ్ పదవి కోసం జనసేన నేతల మధ్య తీవ్ర పోటీ..!

Gollavanitippa Janasena

Gollavanitippa Janasena

Janasena vs Janasena: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నో చిత్రాలు చూడాల్సి వస్తుంది.. సర్పంచ్‌ పదవి కోసం వేర్వేరు పార్టీల మధ్య పోటీ సహజం.. కానీ, సర్పంచ్‌ పదవి ఏకగ్రీవం కోసం ఏకంగా ఒకేపార్టీకి చెందిన ఇద్దరు నేతలు రచ్చకు ఎక్కుతున్నారు.. దీంతో, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం గొల్లవానితిప్ప గ్రామంలో పంచాయతీ ఎన్నికల రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. ముఖ్యంగా జనసేన పార్టీలో సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు రెండు వర్గాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. తమ భార్యలను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి భూములు విరాళంగా ఇస్తామంటూ ఇద్దరు జనసేన నాయకులు ప్రకటించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

సుమారు 5 వేల ఓట్లు ఉన్న గొల్లవానితిప్ప గ్రామంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ గ్రామంలో జనసేన పార్టీకి బలమైన పట్టుంది. అయితే, ఈసారి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో పార్టీలోని ఆశావహుల మధ్య పోటీ మొదలైంది.

రెండు ఎకరాలు ఇస్తానంటున్న శ్రీరామచంద్రమూర్తి
తన భార్య రామలక్ష్మిని సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామానికి రెండు ఎకరాల భూమిని విరాళంగా ఇస్తానని గొల్లవానితిప్పకు చెందిన జనసేన నాయకుడు కొప్పర్తి శ్రీరామచంద్రమూర్తి బహిరంగంగా ప్రకటించారు. ఈ భూమిని గ్రామాభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చని తెలిపారు. గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి మరీ తన ప్రతిపాదనను వెల్లడించారు.

మూడు ఎకరాల హామీతో ముందుకొచ్చిన మరో నేత
ఇదిలా ఉండగా, అదే జనసేన పార్టీకి చెందిన మరో నాయకుడు జంగాల తాతాజీ కూడా రంగంలోకి దిగారు. తన భార్య ధనలక్ష్మిని సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి మూడు ఎకరాల భూమిని ఇస్తానని గ్రామస్తుల సమక్షంలో హామీ ఇచ్చారు. దీంతో రెండు ఎకరాలా.. మూడు ఎకరాలా అనే చర్చ గ్రామంలో మొదలైంది.

జనసేనలో ఏం జరుగుతోంది?
ఒకే పార్టీలో ఇద్దరు నాయకులు తమ భార్యలను సర్పంచ్‌గా నిలబెట్టేందుకు పోటీ పడటం జనసేన శ్రేణుల్లో చర్చకు దారితీసింది. సర్పంచ్ పదవి కోసం భూముల విరాళాల హామీలతో పోటీ పడటం ప్రజల్లో పార్టీకి ఎలాంటి సంకేతాలు పంపుతుందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్ఠపై ప్రభావం చూపే అవకాశం ఉందని జనసేన సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు గొల్లవానితిప్పలో వైసీపీ కూడా బలంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో సర్పంచ్ పదవి ఏకగ్రీవం కావడం అంత సులభం కాదని గ్రామానికి చెందిన కొందరు రాజకీయ నాయకులు చెబుతున్నారు. జనసేనలోని రెండు వర్గాల మధ్య పోటీ మరింత ముదిరితే పార్టీ గ్రామంలో రెండు వర్గాలుగా విడిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఎమ్మెల్యే జోక్యం చేసుకుంటారా?
ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారకముందే భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకే పార్టీలోని ఇరువర్గాలతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తారా? లేక ఈ వ్యవహారంపై మౌనం వహిస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రానున్న రెండు మూడు రోజుల్లో ఎమ్మెల్యే వైఖరిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.