NTV Telugu Site icon

Alla Nani Quits YSRCP: వైసీపీకి మరో బిగ్‌ షాక్‌.. పార్టీ, పదవులకు మాజీ మంత్రి గుడ్‌బై..

Alla Nani

Alla Nani

Alla Nani Quits YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మరో బిగ్‌ షాక్‌ తగిలింది.. పార్టీకి, పార్టీ పదవులకు కీలక నేత గుడ్‌బై చెప్పేశారు.. గోదావరి జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఏలూరు అసెంబ్లీ ఇన్చార్జి పదవితోపాటు ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజీనామా లేఖ పంపించారు. వైఎస్ కుటుంబంతో మొదటి నుంచి మంచి అనుబంధం ఉన్న నాని.. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏలూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2013లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టారు..2014లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ 2017లో ఎమ్మెల్సీగా అవకాశం అందుకున్నారు.

Read Also: CM Revanth Reddy: అమెరికా పర్యటనలో సీఎం బిజీబిజీ.. అడోబ్ సిస్టమ్స్ సీఈవోతో భేటీ

ఇక, 2019 ఎన్నికల్లో ఏలూరు నుంచి మరోసారి పోటీ చేసి విజయం సాధించిన ఆళ్ల నానికి జగన్ తొలి కేబినెట్‌లో డిప్యూటీ సీఎం పదవితో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా అవకాశం దక్కింది. మంత్రివర్గ విస్తరణలో పదవి పోగొట్టుకున్న ఆళ్ల నాని.. ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2024 ఎన్నికల్లో ఏలూరు జిల్లాలో అన్ని స్థానాల్లో వైసీపీ ఘోరంగా ఓడింది. దీంతో జిల్లాలోని వైసీపీ కీలక నేతలు వరుసగా పార్టీని వీడుతూ వస్తున్నారు. ఏలూరు అసెంబ్లీ పరిధిలో వైసీపీ దాదాపుగా ఖాళీ అయిందని చెప్పాలి. ఇదే సమయంలో మాజీ మంత్రి ఆళ్ల నాని తన ఇంచార్జ్‌ పదవితో పాటు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

Read Also: Bhatti Vikramarka: మూడో విడత రుణమాఫీపై రైతులకు శుభవార్త.. ఆ రోజున రుణమాఫీ

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ త్వరలో రీజనల్ కోఆర్డినేటర్ పదవులను ప్రకటించిన నేపథ్యంలో ఆళ్ల నాని జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఉండొచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండకపోయినా.. పార్టీ కార్యక్రమాల్లో మాజీ మంత్రి ఆళ్ల నాని పాల్గొంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఏలూరు అసెంబ్లీ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని భవిష్యత్తు రాజకీయాల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.