NTV Telugu Site icon

Weather Update : మండుతున్న ఆంధ్రావని.. ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..

Hot Temperature

Hot Temperature

వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులతో ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు నైరుతి రుతుపవనాలు ముందుగానే విస్తరించే అవకాశం ఉన్నా. ఎండల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. అయితే.. నిన్న మండపేటలో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం గమనార్హం. పడమర నుంచి వీస్తున్న గాలుల కారణంగా ఎండలు పెరిగినట్టు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. అలాగే, నిన్న వడగాల్పులు వీచాయి. ఆకాశం నిర్మలంగా ఉండడం, వర్ష సూచన లేకపోవడంతో కోస్తాలోని తొమ్మిది జిల్లాల్లో వడగాలులు వీచినట్టు అధికారులు పేర్కొన్నారు.

 

అలాగే, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలతోపాటు మిగిలిన జిల్లాల్లోని 64 మండలాల్లో నేటి నుంచి వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు అధికారులు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు, రాయలసీమలో మాత్రం భిన్నమైన వాతావరణం ఉంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణశాఖ.