NTV Telugu Site icon

Water Problem: ఖాళీబిందెలు, వంటావార్పుతో నిరసన

Water

Water

జీవనాధారం తాగునీరు. ఏ జీవి అయినా ముందుగా తాగేందుకు నీటి కోసం చూస్తుంది. మనుషులైతే నీరు ఎక్కడ దొరుకుతుందోనని ఎదురుచూస్తుంటాడు. అల్లూరిసీతారామరాజు జిల్లా అరకులోయ పర్యాటకులకు స్వర్గథామం. అయితే అక్కడ వుండే స్థానికులకు మాత్రం ప్రకృతి అందాలు ఏమాత్రం ఆనందాన్ని ఇవ్వవు. తాగేందుకు నీరుంటే వారికి చాలు. అరకులోయ మండలం బస్కీపంచాయతీ రంగినిగూడ గ్రామస్తుల దుస్థితి అంతా ఇంతా కాదు.

తాగేందుకు గుక్కెడు నీరు దొరక్క వారు పడుతున్న కష్టాలు అధికారులకు కనిపించడంలేదు. తాగునీటి సమస్య పరిష్కారం కోరుతూ వినూత్నరీతిలో నిరసన చేపట్టారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని పలుమార్లు అధికారులను, నాయకులను కోరినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. హామీలివ్వడం, తర్వాత వాటి గురించి మరిచిపోవడం అధికారులు, నేతలకు వెన్నతో పెట్టిన విద్య. తాగునీరు ఇస్తామని హామీ ఇచ్చి ఏడాది దాటినా ఇప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో బస్కీసచివాలయం ఎదుట గ్రామస్తులు నిరసనదీక్ష చేపట్టారు.

సచివాలయాన్ని ముట్టడించి ఖాళీబిందెలతో నిరసనదీక్షకు దిగారు. ప్రాంగణంలోనే మధ్యాహ్నం, రాత్రి వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. టెంట్లు వేసుకుని అక్కడే రాత్రికి బసచేశారు. ఈసందర్భంగా గిరిజన, సీపీఎం నాయకులు మాట్లాడుతూ ప్రతి ఏడాది తాగునీటి సమస్య ఉత్పన్నమవుతుండడంతో గిరిజనులు కలుషిత నీటిని వినియోగించి వ్యాధుల బారిన పడుతున్నారన్నారు.

పాలకులు, అధికారులు కబుర్లతోకాలయాపన చేస్తూ సమస్య పరిష్కారం కాకపోవడంతో గత్యంతరం లేక ఊటనీటిపై ఆధారపడుతూ వాంతులు, విరేచనాలతో గిరిజనులు మృత్యువాతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం కొబ్బరికాయ కొట్టి వదిలేశారని, మంచినీరు అందించేందుకు మాపోరాటాన్ని వివిధరూపాలలో ముందుకుతీసుకెళ్తామని సీపీఎం నాయకులు హెచ్చరించారు.
Roads Problem: ఏజెన్సీ ఏరియాల్లో కనిపించని ప్రగతి