విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండల తహసీల్దార్ కృష్ణమూర్తి ఓ మహిళా ఎస్సైపై చిందులు తొక్కారు. పనిచేతకాకపోతే గేదెలు కాచుకోవాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. పూసపాటిరేగ మండలం గోవిందపురం గ్రామస్థులు కందివలసగెడ్డలోని ఇసుకను లంకలపల్లి గుండా ప్రతిరోజూ ఎడ్లబండిలో తరలిస్తుంటారు. ఇసుక తరలింపు కారణంగా తమ గ్రామంలోని బోరుబావులు ఎండిపోతున్నాయని లంకలపల్లి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ సోమవారం ఇసుక తరలిస్తున్న ఎడ్లబండ్లను అడ్డుకున్నారు. దీంతో వారిమధ్య వివాదం చెలరేగింది. ఈ విషయం తెలిసిన ఎస్సై జయంతి గ్రామానికి చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
అయితే ఎస్సై మాటలను గ్రామస్థులు లెక్కచేయలేదు. అప్పటికే అక్కడికి చేరుకున్న తహసీల్దార్ కృష్ణమూర్తి జోక్యం చేసుకుంటూ ఎస్సై జయంతితో అసభ్యకరంగా మాట్లాడారు. గ్రామస్థులను అక్కడి నుంచి పంపించడంలో విఫలమయ్యారని ఎస్సైపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పని చేతకాకపోతే యూనిఫాం తీసేసి గేదెలు కాచుకోవాలని, నీకు ఉద్యోగం ఎందుకు అంటూ ప్రశ్నించారు. కాగా మహిళా ఎస్సైని దూషించిన తహసీల్దార్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు సీఐ విజయ్ కుమార్ తెలిపారు.