అగ్నిపథ్ స్కీంకి వ్యతిరేకంగా నిరుద్యోగ యువత హింసకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసంపై అధికారులు తెలుగు రాష్ట్రాల్లో అప్రమత్తం అయ్యారు. రైల్వే ఉన్నత అధికారులతో విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ సమావేశం నిర్వహించారు. రైల్వే పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది.
పూర్తి పోలీస్ బందో బస్తుతో విశాఖ రైల్వే స్టేషన్ కొనసాగుతోంది. పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ యువత కి విజ్ఞప్తి చేస్తున్నాం. హింసాత్మిక కార్యక్రమాలు ద్వారా దేన్ని సాధించలేం. ఆర్మీ కి వెళ్లాలని అనుకునే వాళ్లు, దేశానికీ సేవ చేయాలనుకునే వాళ్లు క్రమశిక్షణ తో ఉండాలి తప్ప ఇలా ప్రవర్తించకూడదని హితవు పలికారు.
ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవు. సోషల్ మీడియాలో హింసాత్మక పోస్టులు పెట్టే కొంతమందిని గుర్తించాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. రైల్వే స్టేషన్ పరిధిలో పూర్తి బందోబస్తూ నిర్వహిస్తున్నాం. అక్కడ ఉన్న కొన్ని డిఫెన్స్ అకాడమీ వాళ్ళతో మాట్లాడాము. విద్యార్థుల కదలికలపై నిఘా ఉంచమని చెప్పామన్నారు.
విశాఖ రైల్వేస్టేషన్లో భద్రతపై ఆర్పిఎఫ్, జీఆర్పీ, పోలీస్ అధికారులతో సమావేశం అయ్యారు సీపీ శ్రీకాంత్. విశాఖ, గుంటూరు రైల్వే స్టేషన్ల పై సంఘ విద్రోహ శక్తులు దాడులు చేసే అవకాశం ఉందని సమాచారం ఉందన్నారు. రైల్వే ఆస్తులు, కేంద్ర ప్రభుత్వం ఆస్తులకు ప్రత్యేక భద్రతకు కల్పిస్తున్నాం. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు వద్ద ప్రత్యేక నిఘాగా పెట్టాం. వాట్సాప్ గ్రూపుల్లో కొంతమంది రెచ్చగొట్టే ప్రసారాలు చేస్తున్నారు, వారిని గుర్తించే పనిలో ఉన్నాం. ఆర్మీ రిక్రూటింగ్ అధికారులు, డిఫెన్స్ అకాడమీ వాళ్ళతో ఇప్పటికే సంప్రదించామన్నారు.
సంఘవిద్రోహ శక్తుల మాయలోపడి యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఒక్కసారి కేసులు నమోదయితే యూనిఫాం వేసుకునే అవకాశం ఉండదనే ఈ విషయాన్ని గుర్తించాలి. ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవు. దేశానికి సేవ చేయాలి అనుకునే వాళ్లు క్రమశిక్షణతో ఉండాలి.. దేశ ఆస్తులను కాపాడుకోవాలి.
రైల్వే స్టేషన్లో పూర్తి భద్రత చర్యలు చేపట్టామన్నారు రైల్వే ఎస్పీ అరవింద్ నాథ్. లోకల్ పోలీసులతో సమన్వయంతో పని చేస్తున్నామన్నారు. ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ల వద్ద ప్రత్యేక నిఘా పెట్టాం. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పారు. ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ ల్లో కొన్నిటిని మూసి వేస్తున్నామన్నారు అరవింద్.
Viswa Hindu parishad: విధ్వంసం వెనుక ఉగ్రవాద శక్తుల హస్తం!