Vizag Crime: క్రికెట్ విషయంలో వివాదం.. విశాఖలో యువకుడి దారుణ హత్య

Crime

Crime

Vizag Crime: క్రికెట్‌ విషయంలో తలెత్తిన ఓ వివాదం యువకుడి దారుణ హత్యకు దారి తీసిన ఘటన విశాఖపట్నంలో వెలుగు చూసింది.. ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడిని కత్తితో పొడిచి హతమార్చిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడు పెదగదిలి కొండవాలుకు చెందిన డిగ్రీ విద్యార్థి డోల అజిత్ (23)గా గుర్తించారు. సమాచారం ప్రకారం, క్రికెట్ ఆట విషయంలో అజిత్ మరియు కిషోర్ అనే వ్యక్తి మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. గతవారం పోలమాంబ పండుగ సమయంలో కూడా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది.

Read Also: RCB 5 Records: డివిలియర్స్ రికార్డును సమం చేసిన టిమ్ డేవిడ్.. 250 పరుగులతో 5 రికార్డులు నెలకొల్పిన ఆర్‌సిబి

ఈ నేపథ్యంలో నిన్న రాత్రి మద్యం మత్తులో ఉన్న కిషోర్, పెదగదిలి జంక్షన్ వద్ద అజిత్‌ను కలుసుకుని మళ్లీ గొడవకు దిగాడు. ఈ గొడవలో ఆగ్రహానికి గురైన కిషోర్ కత్తితో అజిత్‌ను పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన అజిత్‌ను కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అజిత్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఇక, ఘటన అనంతరం నిందితుడు కిషోర్ స్వయంగా ఆరిలోవ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.