Site icon NTV Telugu

GVMC New Mayor: గ్రేటర్ విశాఖ మేయర్‌గా పీలా శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక..

Peela Srinivasa Rao

Peela Srinivasa Rao

GVMC New Mayor: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) మేయర్‌గా టీడీపీకి చెందిన పీలా శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. శ్రీనివాసరావు పేరును జనసేన ప్రతిపాదించగా.. బీజేపీ బలపరిచింది.. పీలా అభ్యర్థిత్వాన్ని ముక్తకంఠంతో ఆమోదించింది కౌన్సిల్.. ఇక, మేయర్‌ ఎన్నికలను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బహిష్కరించింది.. నూతన మేయర్ పీలా శ్రీనివాసరావుతో ప్రమాణం చేయించారు విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్..

Read Also: Delhi: ప్రధాని మోడీతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కీలక భేటీ.. ఉత్కంఠ రేపుతున్న చర్చలు

దీంతో, ఏపీలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీపై జెండా ఎగరేయాలన్న టీడీపీ కల ఎట్టకేలకు నెరవేరింది. ఏడాది కాలపరిమితి కోసం జరుగుతున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయం సాధించారు.. మేయర్ అభ్యర్ధిగా ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ పేరును టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. పార్టీ బీఫార్మ్ ను పీలాకు అందజేశారు నగర పార్టీ అధ్యక్షుడు గండిబాబ్జీ. ఈ రోజు కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరిగింది.. 98 వార్డులతో వున్న మహా విశాఖ నగర పాలక పీఠం దక్కించుకోవడం రాజకీయ పార్టీలు కీలకంగా భావిస్తాయి. 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి వున్న స్టీల్‍ సిటీ పై పట్టు సాధించాలంటే మేయర్ పీఠం కీలకం. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి విశాఖ కంచుకోటే అయినప్పటికీ స్ధానిక సంస్ధలపై ఆజిమాయిషీ చేసే ఛాన్స్ లభించలేదు. 2011లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 58 వార్డులు గెలుచుకుని మేయర్ పీఠం దక్కించుకుంది. నలుగురు ఎమ్మెల్యేల బలం వుండి కూడా టీడీపీ 28 స్థానాలకు పరిమితం అయింది.

Read Also: Pahalgam Terror Attack: పాక్-భారత్ ఉద్రిక్తతలపై అమెరికా కీలక సూచన

ఇక, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లోకల్ బాడీస్ నాయకత్వం మార్పు అనివార్యం అయింది. ఆ జాబితాలో జీవీఎంసీ చేరగా అనూహ్యమైన రాజకీయ పరిణామాలు, క్యాంప్ రాజకీయాలు జరిగాయి. వైఎస్సార్సీపీ, కూటమి పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మ్యాజిక్ ఫిగర్ 74 కోసం ఆఖరి నిముషం వరకు ఊగి సలాట కొనసాగడంతో ఫలితం తీవ్ర ఉత్కంఠకు గురిచేసింది. మాజీమంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె, 6వ వార్డు కార్పోరేటర్ లక్ష్మీ ప్రియాంక ఓటుతో కూటమి గట్టెక్కింది. అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో నాలుగేళ్ల గ్రేటర్ విశాఖ మేయర్ గా పనిచేసిన గొలగాని హరివెంకటకుమారి పదవిని కోల్పోయారు. ఇక, డిప్యూటీ మేయర్ జియ్యాన్ని శ్రీధర్ పైన నో కాన్ఫిడెన్స్ మోషన్ సక్సెస్ చేసింది కూటమి. దీంతో మేయర్, డీప్యూటీ మేయర్ స్ధానాలు ఖాళీ అయ్యాయి. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ముందుగా మేయర్ ఎలక్షన్ జరుగుతుంది. మొదటి నుంచి ప్రచారంలో వున్న పీలాశ్రీనివాస్ పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఉత్త రాంధ్ర పర్యటనలో ముఖ్యమంత్రి దగ్గరకు పీలాను తీసుకు వెళ్లిన ఎమ్మెల్యేలు ఆయన అభ్యర్ధిత్వానికి ఆమోదం లభింపజేసుకున్నారు. ఈ రోజు పీలా శ్రీనివాసరావును ఏకగ్రీవంగా మేయర్‌గా ఎన్నుకున్నారు.

Exit mobile version