NTV Telugu Site icon

Hayagreeva Lands: హయగ్రీవ ఫామ్స్ అండ్ విల్లాస్‌కు మరో షాక్‌..!

Hayagreeva Lands

Hayagreeva Lands

Hayagreeva Lands: విశాఖపట్నంలో ప్రభుత్వ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన హయగ్రీవ ఫార్మ్ అండ్‌ విల్లాస్ సంస్థకు షాక్ మీద షాక్ తగులుతోంది. సుమారు 500 కోట్ల రూపాయల విలువైన 12.5 ఎకరాలను స్వాధీనం చేసుకున్న జిల్లా యంత్రాంగం.. వాటిని 22ఏ జాబితాలో చేర్చింది. నిషేధిత భూములుగా నోటిఫై చేయడంతో రిజిస్ట్రేషన్ పై ఆంక్షలు అమలులోకి వచ్చాయి. అధికారం అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూములతో అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన హయగ్రీవ ఫార్మ్ అండ్‌ విల్లాస్ కు విశాఖ జిల్లా యంత్రాంగం చుక్కలు చూపిస్తోంది. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆయన వ్యాపార భాగస్వాములతో కలిసి వేసిన స్కెచ్ మొదటికే మోసం తెచ్చింది. అక్రమాలపై విచారణలో నిజాలు నిగ్గు తేలడంతో 16 ఏళ్ల తర్వాత కేటాయింపులు రద్దు చేసినట్టు ప్రకటిం చింది.

Read Also: CM Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. జైశంకర్ తో భేటీ అయ్యే అవకాశం..

ఇక, ఆదేశాలు వెలువడిన గంటల వ్యవధిలోనే ఎండాడలోని సుమారు 500కోట్ల రూపాయల విలువైన భూములను స్వాధీనం చేసుకుని కంచేవేసింది రెవెన్యూ యంత్రాంగం. సర్వే నెంబర్ 92/3లోని 12.51 ఎకరాలను 22(A) జాబితాలో చేర్చడం ద్వారా నిషేధిత భూములుగా ప్రకటించింది. దీంతో హయగ్రీవకు సంబంధించిన క్రయవిక్రయాలు., రిజిస్ట్రేషన్ లు పై ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టు మీద కోట్లాది రూపాయలు పెట్టిన వాళ్లకు దిక్కుతోచని స్థితి. వృద్దులు కోసం విల్లాలు, అనాథలుకు ఆశ్రమం పేరుతో 2008లో ప్రభుత్వం నుంచి చౌక ధరకు భూములు తీసుకుంది హయగ్రీవ. ఎకరా 45 లక్షల చొప్పున కొనుగోలు చేయగా.. అడ్డగోలుగా పార్టనర్లను చేర్చుకోవడం ద్వారా భారీ అవకతవకలకు పాలడినట్టు విచారణలో తేలింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం లక్ష్యంగా చేసిన ఈ భూమంతర్ కారణంగా స్థిరాస్తి విలువ 40శాతం పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. గ్రూపు డెవలప్‌మెంట్‌ స్కీమ్‌ కింద 61 మందితో చేసుకున్న ఒప్పందాల మేరకు విల్లాల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఈ తరుణంలో హయగ్రీవ భూ కేటాయింపులు రద్దయ్యాయి. నిషేధిత జాబితాలో చేర్చడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. 22(ఏ) కారణంగా ఎటువంటి క్రయవిక్రయాలు అవకాశం లేదు. నిబంధనలు ఉల్లంఘించడం, స్వార్థంగా వ్యవహరించడం వల్లనే భూమిని వెనక్కి తీసుకున్నామని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

12.51 ఎకరాల భూమిలో 10 శాతం భూమి ఉపయోగించి వృద్ధులు, అనాథలు, దివ్యాంగులకు ఆశ్రమం నిర్మిస్తామని, ఉచితంగా నిర్వహిస్తామని ఒప్పందం చేశారు. పదిహేనేళ్లు అయినా దానిని పూర్తి చేయలేదు. కానీ ఈ హామీని కూడా అమలు చేయకపోవడం వల్ల భూమిని రద్దు చేశారు.